ఇన్సెంటీవ్‌ విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగిస్తాం

Jan 17,2024 22:35

ధర్మవరంలో సమ్మె చేస్తున్న పట్టురైతులు, రీలర్లు

                     హిందూపురం : పట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటీవ్‌ను విడుదల చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టుగూళ్ల మార్కెట్ల బంద్‌ కొనసాగిస్తామని పట్టు రైతు సంఘం నాయకులు అన్నారు. ఇన్సెంటీవ్‌ విడుదల చేయాలని డిమెండ్‌ చేస్తు బుధవారం పట్టణంలోని పట్టు గూళ్ల మార్కెట్‌ను బంద్‌ చేసి పట్టు రైతులతో కలసి దీక్ష చేపట్టారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్బంగా పట్టు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ధనపూరం వెంకట్రామిరెడ్డి, సుబ్బిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలాజీ మ\నోహర్‌ మాట్లాడుతు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులను అన్ని విదాల ఆదుకుంటామని చెప్పి పట్టు రైతులను పూర్తి విస్మరించారన్నారు. 2017 నుంచి ఇన్సెంటీవ్‌ రావాల్సి ఉంటే గతంలో చేసిన ఆందోళనకు కొద్దిగా విడుదల చేశారన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క హిందూపురం పట్టు గూళ్ల మార్కెట్‌కు సంబందించి పట్టు రైతులకు రూ.17 కోట్లు, రీలర్లకు రూ.3కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 66 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఈ బకాయిలు విడుదల గురించి ఇప్పటి వరకు 12 సార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను వివరించామన్నారు. దీంతో పాటు రైతు సదస్సును హిందూపురం పట్టు గూళ్ల మార్కెట్‌లో ఏర్పాటు చేసి, ఈ సదస్సుకు రాష్ట్ర వ్యవసాయ శాక మంత్రి కన్నబాబును, సిరికల్చర్‌ కమిషనర్‌ను ఆహ్వానించి సమస్యలను వివరించామన్నారు. ఆ సమయంలో వెంటనే ముఖ్యమంత్రికి వివరించి, 15 రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్న మూడు రూపాయల ఇన్సెంటీవ్‌ విడుదల చేయలేదన్నారు. ఇన్సెంటీవ్‌ విడుదల చేసే వరకు పట్టు రైతులకు ఎంత నష్టం వచ్చిన లెక్క చేయకుండా మార్కెట్‌లను బంద్‌ కొనసాగిస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు రైతు సంఘం నాయకులు సిద్దా రెడ్డి, జయరామిరెడ్డి, సోమ కుమార్‌, హనుమంతరెడ్డి, రీలర్లు ముస్తపా, అన్సార్‌, ఖలీల్‌, కాంగ్రెస్‌ నాయకులు అమానూల్లా, జమీల్‌, తిరుపాల్‌, రామాంజినేయులతో పాటు పట్టు రైతులు, రీలర్లు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పట్టురైతులకు, రీలర్లకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా వారిని మోసం చేశారని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న విమర్శించారు. ఐదేళ్లగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక సిరికల్చర్‌ కార్యాలయం వద్ద పట్టు రైతులు, రీలర్లు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జం గాలపల్లి పెద్దన్న, సిపిఎం నాయకులు ఎస్‌హెచ్‌. భాషా తదితరులు సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టురైతులకు రూ.67కోట్లు బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. ఇందులో ధర్మవరం సిరికల్చర్‌ కార్యాలయ పరిధిలో 500 మంది రైతులకు రూ.10 కోట్ల దాకా ఇన్సెంటివ్‌ బకాయిలు రావాల్సి ఉందన్నారు.

➡️