ఇళ్ల స్థలాలు.. సాగుభూమి కోసం పేదల నిరసనాగ్రహం..!

కలెక్టరేట్‌ గేటు ముందు బైఠాయించిన ఆందోళన చేస్తున్న పేదలు

        పుట్టపర్తి అర్బన్‌ :        సాగు భూమి, ఇళ్ల స్థలాలు, నష్టపరిహారం కోసం శ్రీసత్యసాయి జిల్లాలో పేదలు కదం తొక్కారు. సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పేదలు సోమవారం ఉదయం కలెక్టరేట్‌ ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. హిందూపురం, పాలసముద్రం, చిలమత్తూరు, కొడికొండ చెక్‌ పోస్ట్‌ తదితర ప్రాంతాలకు చెందిన పేదలు గణేష్‌ సర్కిల్‌ నుంచి గోకులం మీదుగా ర్యాలీ చేపట్టారు. మండుటెండలో కలెక్టరేట్‌ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఇళ్ల స్థలాలు, సాగుపట్టాలు, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాలసముద్రం సమీపంలో నాసన్‌, బెల్‌ పరిశ్రమల కోసం కారుచౌకగా దళితుల భూములను ప్రభుత్వం లాక్కోందన్నారు. ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించి, సరైన నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. పేదల అభివద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆచరణ మాత్రం అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారన్నారు. పేదల పక్షాన పోరాడాల్సిన టిడిపి, జనసేన పార్టీలు రాకదలిరా అంటూ అధికారం కోసం ఆర్రులు చాస్తున్నారే తప్పా పేదల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ మాట్లాడుతూ సత్యసాయి జిల్లా పరిధిలోని రొద్దం ప్రాంతంలో పేదలు సాగులో ఉన్న భూములను ఈ ప్రభుత్వం టింబక్టు సంస్థకు కట్టబెట్టిందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దళితుల భూములను అన్యక్రాంతం చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఆయన దృష్టికి తెద్దామంటే పోలీసులు వామపక్షాల నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారన్నారు. అరెస్టులతో పేదల సమస్యలను మరుగున పర్చాలే ప్రభుత్వం వ్యవహరించడం విచాకరం అన్నారు. పేదల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, సహాయ కార్యదర్శి పైపల్లి గంగాధర్‌, నాయకులు నారాయణ, వెంకటేశు, రాముడు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమయ్య, రమణ, కొండ వెంకటేష్‌, తిప్పన్న, మహిళా వ్యకాసం జిల్లా కన్వీనర్‌ వర్షిని, కో కన్వీనర్‌ అశ్విని తదితరులు పాల్గొన్నారు.

➡️