ఈతచెట్లు తొలగింపు అన్యాయం

Feb 27,2024 22:04

ఈతచెట్లు ధ్వంసం చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నాయకులు

                        రొద్దం : మండలంలోని కంచి సముద్రం వద్ద ఉన్న వందలాది ఈతచెట్లను అధికార పార్టీ అండదండలతో కొంతమంది ధ్వంసంచేసి నేలను చదును చేసి ఆక్రమించుకుంటున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. ఈ మేరకు సిపిఎం జిల్లా నాయకులు పెద్దన్న, టిడిపి నియోజకవర్గ నాయకులు చిన్నప్పయ్య మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ప్రోద్బలంతోనే భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా భాధితులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి ఈత చెట్లను పెంచుకొని కుటుంబలను పోషించుకొంటున్నమని ఇలా ఉన్నపళంగా ఈత చెట్లను తొలగించి భూమిని ఆక్రమిస్తుండటంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది గీత కార్మికుల కుటుంబాల న్యాయం కోసం పోలీసుల ఆశ్రయించగా పోలీసులు కూడా 500 రూపాయలు జరిమానా వదిలేశారని వాపోయారు. గీతకార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. పెనుకొండ : రొద్దం మండలం ఆర్‌ కంచిసముద్రం లో మంత్రి ఉషశ్రీ చరణ్‌ అనుచరుల భూకబ్జాపై పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ భూ కబ్జా కోసం 500 ఈత చెట్లను అధికార పార్టీ వారు ధ్వంసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️