ఎన్నికల్లో మహిళా పోలీసుల పాత్ర కీలకం : డీఎస్పీ

Mar 22,2024 21:52

 మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

                     ధర్మవరం టౌన్‌ : ఎన్నికలు సజావుగా జరిపించడంలో మహిళా పోలీసులు ప్రత్యేక పాత్ర వహించాలని ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పట్టణంలోని గాంధీనగర్‌ మారుతి రాఘవేంద్రస్వామి కళ్యాణమండపంలో ధర్మవరం సబ్‌డివిజన్‌లోనిసచివాలయాల మహిళా పోలీసులకు వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, డీఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఒక్క ఉద్యోగి నిజాయితీగా, నిబద్ధతగా పనిచేయాలన్నారు. వార్డులు, గ్రామాల్లో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరిగినా, ఏవైనా చిన్నపాటి గొడవలకు కారణమయ్యే సమస్య ఉన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని రావాలన్నారు. చిన్నపాటి సమస్యలే ఎన్నికల్లో రాజకీయ గొడవలకు దారితీస్తాయని చెప్పారు. అలాంటి వాటిని ముందుగానే మహిళా పోలీసులు గుర్తించాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వారిపైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా వారిపై సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరి సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ డీఎస్పీతో పాటు వన్‌టౌన్‌ సిఐ సుబ్రహ్మణ్యం, టూటౌన్‌ సిఐ అశోక్‌ కుమార్‌, డివిజన్‌ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, వార్డు, గ్రామాల సచివాలయాల మహిళా పోలీసులు పాల్గొన్నారు.

➡️