ఎన్నికల ప్రచార వేడి..!

         అనంతపురం ప్రతినిధి : ఎన్నికల షెడ్యుల్‌ వెలువడక ముందే ప్రచార వేడి పెరుగుతోంది. అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధాన పార్టీలన్నీ రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇప్పటికే వైసిపి సిద్ధం సభను రాయలసీమ స్థాయి సమావేశాన్ని అనంతపురం జిల్లా రాప్తాడు కేంద్రంలో నిర్వహించారు. దీనికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేపట్టారు. ఒక విధంగా సక్సెస్‌ అయిందని వైసిపి శ్రేణులు సంబరపడుతున్నాయి. ఈ సభ ద్వారా తమ సత్తాని చాటుతామని చెప్పారు. ఇకపోతే తాజాగా టిడిపి కూడా ప్రచారానికి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు వచ్చే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈనెల 26 తరువాత జిల్లాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు టిడిపి సిద్ధం అవుతోంది. అంతలోపు టిడిపి, బిజెపి, జనసేన పొత్తుల వ్యవహారం కూడా తేలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కదలిరా కార్యక్రమాన్ని ఉరవకొండలో టిడిపి నిర్వహించింది. ఆ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఆ సభకు కూడా మంచి స్పందనే వచ్చిందని టిడిపి నాయకులు భావిస్తున్నారు. రాబోయే సభలను కూడా ఇదే విధంగా విజయవంతం చేస్తామని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్‌ కూడా ఇక్కడి నుంచే రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించనున్నట్టు ప్రకటించింది. దీనికి జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పిసిసి అధ్యక్షురాలు షర్మిల ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జాతీయ స్థాయి నాయకులు హాజరవుతుండటంతో కాంగ్రెస్‌ కూడా తన బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. సిడబ్ల్యుసి సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించడమే కాకుండా మడకశిరలో తనకు పట్టున్న నియోజకవర్గం కావడంతో వచ్చే ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలన్న పట్టుదలతోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా ఆయన సమావేశాలు నిర్వహించే పనిలోనున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రభావం చూపే వారిని గుర్తించి బరిలో దింపేందుకు సిద్ధమవుతోంది. మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలుపెడుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ ప్రచారంలో పోటీపడుతున్నాయి. అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఖరారైపోతే ప్రచారాలు మరింత తారా స్థాయికి చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికీ అభ్యర్థులు అనుమానమున్న చోట పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఖరారైన చోట మాత్రం నేతలు రోజుకొక చోటకు పర్యటనలు జరుపుతున్నారు. సాధ్యామైనంత వరకు ఇంటింటికెళ్లి ప్రజలను కలుసుకునే పనిలోనున్నారు. ఏది ఏమైనా మండు వేసవి ప్రారంభంతోనే ప్రచార వేడి ఊపందుకోవడం గమనార్హం. కాగా జనసేన సందడి మాత్రం జిల్లాలో అంతగా కన్పించడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు ఇటువంటి ఎన్నికల ప్రచారాల్లోకి రాలేదు. తక్కిన మూడు ప్రధాన పార్టీల నుంచి మాత్రం నేతల తాకిడి పెరిగింది. రాబోయే రోజుల్లో ఇవి మరింత తారాస్థాయికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

➡️