ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం : పల్లె

Mar 8,2024 21:11

శంఖారావం సభలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

                      కొత్తచెరువు రూరల్‌ : వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, టిడిపి పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పల్లె రఘునాథ్‌ రెడ్డి విమర్శించారు.కొత్తచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలతోపాటు ఏ వర్గమూ ఆనందంగా లేదని అన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీలపై వేలాది అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చివరకు తనపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుపెట్టారని చెప్పారు. ఒక్కసారి గెలిపిస్తేనే పన్నులమీద పన్నులు వేస్తూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేశారని విమర్శించారు. మహిళలకు సంబంధించిన రూ. 2500 కోట్లు అభయహస్తం నిధులు మాయం చేశారని ఆరోపించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివాడు ప్రజలకేం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. జగన్‌పాలనలో రాష్ట్రం 50ఏళ్లు వెనక్కి పోయిందని ఇకనైనా ప్రజానీకం మేల్కోవాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి అవినీతి అనకొండగా మారారని ఆరోపించారు. బ్యాంకులకు రూ. 1670 కోట్లు టోకరా వేసిన వ్యక్తి ఏవిధంగా ప్రజలకు సేవలందిస్తారని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక పుట్టపర్తిని టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని, పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.

➡️