ఓటర్లకు అనువుగా పోలింగ్‌ కేంద్రాలు

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అరుణబాబు

         లేపాక్షి : ఆయా ప్రాంతాల్లో ఓటర్లకు అనువుగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లేపాక్షి, గోరంట్ల పట్టణాల్లో వివిధ పాఠశాలల్లో పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల కోసం స్థలాల ఏర్పాట్లను కలెక్టర్‌ మంగళవారం నాడు పరిశీలించారు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాలు, రిసెప్షన్‌ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి.. ఎన్ని రూమ్‌లు అవసరం అవుతాయి.. తదితర వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం కొత్త మాన్యువల్‌ను అనుసరించి ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలన్న అంశాలపై అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ కేంద్రానికి చేరుకునేందుకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవరాదన్న ఉద్ధేశంతో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కార్యచరణ ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఆర్డీవోలు భాగ్యరేఖ, వంశీకష్ణ, రమేష్‌ రెడ్డి, లేపాక్షి తహశీల్దార్‌ బాబు, గోరంట్ల తహశీల్దార్‌ రంగనాయకులు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️