కదం తొక్కిన ఆశా వర్కర్లు

Dec 15,2023 09:09

పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు

          పుట్టపర్తి రూరల్‌ : సమస్యల పరిష్కారం కోరుతూ ఆశావర్కర్లు పోరుబాట పట్టారు. హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 36 గంటల నిరసన దీక్షకు దిగారు. ఈ మేరకు పట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం నాడు దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశా కార్యకర్తలు హాజరయ్యారు. దీక్షలకు వెళ్లనీయకుండా ఆయా ప్రాంతాల్లో పోలీసులు వీరిని అడ్డుకున్నా వాటిని ఎదిరించి దీక్షల్లో ఆశలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశలు ముక్త కంఠంతో నినదించారు. పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆశల 36 గంటల నిరసన దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ దీక్షలకు సిపిఎం, టిడిపి, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదరిశ ఎం.ఇంతియాజ్‌ ఇంతియాజ్‌, టిడిపి నాయకుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ తదితరులు మద్దతు తెలిపారు. ఆశా వర్కర్ల జిల్లా గౌరవాధ్యక్షులు సాంబయ్య, బాబావలి, జిల్లా ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, సౌభాగ్య దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఆశాలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వేతనాల పెంపుకోసం ఆందోళనలు చేయాల్సిన దుస్థితిని కల్పించడం విచాకరం అన్నారు. ఆశాలకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సెలవులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలను ఆశాలకు వర్తింపజేయాలన్నారు. కోవిడ్‌ కాలంలో మరణించిన ఆశాల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్‌గ్రేషియా ఇచ్చి, ఆ కుటుంబంలో ఒకరిని ఆశాగా తీసుకోవాలన్నారు.ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాల్లో ఆశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశాల న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ హక్కుల సాధన కోసం పోరాటమే మార్గం అన్నారు. సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆశాల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు అన్ని విధాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిత్యావసర సరుకులు ధరలు పెరగడంతో ప్రజలు జీవన స్థితిగతులు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ఆశాలు, అంగన్వాడీలకు వేతనాలు పెంచమంటే డబ్బుల్లేవనే ముఖ్యమంత్రి తన సలహాదారులకు మాత్రం కోట్లాది రూపాయలను జీతాలు రూపంలో ఖజానా సొమ్మును పంచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సామకోటి ఆదినారాయణ, అంబులెన్స్‌ రమేష్‌, చక్రపాణి, జనసేన నాయకులు అబ్దుల్‌, రాము, ఆశ వర్కర్ల జిల్లా కమిటీ నాయకురాలు హనుమక్క, బషీర్‌, దర్శనమల పుష్పతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️