క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో మెలగాలి : కలెక్టర్‌

Jan 31,2024 22:17

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కలెక్టర్‌

                     పుట్టపర్తి రూరల్‌ : క్రీడాకారులు ఏ క్రీడలోనైనా గెలుపోటములను సమానంగా స్వీకరించి ఆటలో రాణించాలని, క్రీడాస్ఫూరితో మెలగాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఆడదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ప్రధమ బహుమతులు తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. బుధవారం పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ సమీపంలో వై జంక్షన్‌ ఎదురుగా ఉన్న క్రీడా మైదానంలోజిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, వ్యవసాయ సలహా మండల చైర్మన్‌ ఎవి. రమణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఓబులపతి, హుడా చైర్మన్‌ లక్ష్మీ నరసమ్మ, ఆర్డీవో భాగ్యరేఖ, క్రీడా అధికారి ఉదయ భాస్కర్‌, నోడల్‌ అధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ నెల 26 నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను గ్రామ సచివాలయ, మండల, స్థాయిలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. బుధవారం నియోజకవర్గ, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. శారీరక, మానసిక ధృఢత్వం పెంపొందించే ఉద్దేశంతో క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఆడదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలలో క్రీడ ప్రతిభను ప్రదర్శించి భవిష్యత్తు రోజులలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఆరు నియోజకవర్గంలో సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ , సంయుక్త కలెక్టర్‌ వాలీబాల్‌ ఆడారు. ఈ కార్యక్రమంలోమోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌, కోచ్‌లు, పీడీలు, పిఇటిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️