టిడిపి హయాంలోనే పంచాయతీల అభివృద్ధి : బికె

Dec 13,2023 22:40

సమావేశంలో మాట్లాడుతున్న బికె. పార్థసారధి

                      పెనుకొండ : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బికె.పార్థసారథి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల సమర శంఖరావం కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్థసారథి మాట్లాడుతూ సర్పంచుల నిధులను కూడా వైసిపి కాజేస్తోందన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు సహించలేక 20 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదని విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో గ్రామపంచాయతీలో తిరోగమనంలో పడ్డాయన్నారు. పట్టణాలతో సమానంగా పల్లెలను కూడా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి గ్రామాలను నిలువ దోపిడీ చేస్తున్న నియంత పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ సర్పంచుల సంఘం అధ్యక్షులు భూషణ్‌, ప్రస్తుత సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.

➡️