తండాకు దారి సౌకర్యం కల్పించండి

Dec 11,2023 21:43

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

                      తనకల్లు : మండల పరిధిలోని గేమే నాయక్‌ తండా పంచాయతీ లో గల పోమేనాయక్‌ తండాకు దారి సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరారు. ఈ మేరకు పోమేనాయక్‌ తండాకు చెందిన మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులు నివసించే తండాలకు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ మొర ఆలకించే నాయకుడే కన్పించలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రం తమ ఓట్లను పొందడానికి అనేక హామీలతో వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సౌకర్యం, పిల్లల చదువులకు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడే రోగులను తరలించడానికి కూడా 108, 104 వాహనాలు కూడా రాని పరిస్థితి ఉందని వాపోయారు. సమస్యను అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 300 కుటుంబాలు గల తండా ప్రజలు మొత్తం తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించామన్నారు. స్పందించిన తహశీల్దార్‌ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాయలసీమ అధ్యక్షులు మూడే ప్రసాద్‌ నాయక్‌, రవీంద్ర నాయక్‌, శ్రీనివాసులు నాయక్‌, బాలాజీ నాయక్‌తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

➡️