తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్‌

వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

        పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్రంలో తుఫాన్‌ ఏర్పడిన సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు ఎస్‌పి మాధవరెడ్డి, సంయుక్త కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్య పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో హెచ్చరించినందున ప్రజలతోపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీప నది తీర ప్రాంతాల్లో నదులు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. భారీ వర్షాలకు పంట నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ముందుగా అటువంటి సందర్భాలలో అధికారులు పూర్తి జాగ్రత్త వహించాలన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించిన వెంటనే మండల కేంద్రాలు, సచివాలయాలు, ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సంజీవయ్య, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️