నాలుగున్నరేళ్లలో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

Dec 10,2023 20:48

మినీమేనిఫెస్టో కరపత్రాన్ని అందజేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

                కనగానపల్లి :రాప్తాడు నియోజకవర్గంలో ఈనాలుగేన్నరేళ్లలో ప్రాజెక్టులు ఏం నిర్మించారో… ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. మండలంలోని రాంపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికీ వెళ్లి టీడీపీ మ్యానిఫెస్టోకి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అందులో ఉన్న పథకాల గురించి వివరించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా సునీత మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు శాశ్వత ప్రాతిపదికన జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరందించే క్రమంలో భాగంగా ప్రధాన కాలువ నిర్మాణంతో పాటు కనగానపల్లి మండలంలో సోమరవాండ్లపల్లి పుట్టకనుమ ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పుట్టకనుమ ప్రాజెక్టును రద్దు చేశారన్నారు. 2019ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. కచ్చితంగా ముందుగానే డిజైన్‌ చేసిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేవారమన్నారు. వైసీపీ నాయకులు పుట్టకనుమను రద్దు చేసి.. ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లను నిర్మిస్తామని ప్రగల్పాలు పలికారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కనీసం ఒక ఎకరం కూడా భూసేకరణ చేయలేదని ఎద్దేవా చేశారు. వీటి కోసం లక్ష రూపాయల నిధులు కూడా మంజూరు చేసిన పరిస్థితి లేదన్నారు. సోమరవాండ్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం కొంతవరకు పనులు చేశాక.. కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆ పనులు కూడా నిలిచిపోయాయన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పే ఎమ్మెల్యే కనీసం పిల్ల కాల్వలు కూడా బాగు చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. గోరంట్ల : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. పట్టణంలోని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి అశ్వత్‌ రెడ్డి నివాసంలో టిడిపి కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్థసారథి మాట్లాడుతూ గోరంట్ల మండలంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరసింహులు, నీలకంఠ రెడ్డి, బెల్లాల చెరువు చంద్ర, వెంకట్‌ రెడ్డి, నరేష్‌ కుమార్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️