పక్కాగా ఎన్నికల నియమావళి అమలు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి

         పుట్టపర్తి అర్బన్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కగా అమలు చేయాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై నియోజకవర్గ ఎన్నికల అధికారులు, సెక్టార్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, డిఆర్‌ఒ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 27 మంది అధికారులను వివిధ టీంలలో నోడల్‌ అధికారులకు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు ఏప్రిల్‌ మొదటి వారంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు ఎక్కడా చిన్న పొరపాటు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను వందశాతం అమలు చేయాలన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన నిర్ధారణ జరిగితే సత్వరమే ఎన్నికల కమిషన్‌ లేదా జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి అన్ని అనుమతులు పొందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఎన్నికల్లో వద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చిందని, దీనిపై ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ద్వారా అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీస్‌ యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక నిఘా బందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ విధానం కూడా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల దశ్య అక్రమ, నగదు, మద్యం, డ్రగ్స్‌ ఆయుధాలు వస్తువులు తదితర వాటి అంతరాష్ట్ర తరలింపుపై కూడా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులు పుట్టపర్తి భాగ్యరేఖ, కదిరి వంశీకష్ణ, ధర్మవరం వెంకట శివ సాయి రెడ్డి, మడకశిర గౌరీ శంకర్‌, డీఎస్పీలు, సిఐలు, నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️