పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 31,2023 21:54

ధర్మవరంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

                పెనుకొండ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, మండల కార్యదర్శి బాబావలి, నగర పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు చిన్న వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, నారాయణ, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు మునెమ్మ, దివ్యభారతి, నగర పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు చిన్న వెంకటేష్‌, రిక్షా నర్సింహులు, తిప్పన్న, ముత్యాలు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి అర్బన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు అర్ధ నగ ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఆదివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో అర్ధ నగ ప్రదర్శనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి పైపల్లి గంగాధర్‌ మాట్లాడుతూ, నిరవధిక సమ్మె 6 వ రోజుకు చేరుకుందన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు నాగార్జున, గోవిందు, రామయ్య, నరసింహులు, పెద్దన్న, సాయి, నారాయణమ్మ, మారెక్క, సరోజమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఆరవరోజైన ఆదివారం కొనసాగింది. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుపై సిఐటియు నాయకులు జగన్మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారి కడుపు మీద కొడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ధర్మవరం టౌన్‌ : తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికసంఘం జిల్లాకార్యదర్శి లక్ష్మీనారాయణ హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం 6వ రోజు కొనసాగింది.. ఈ సందర్భంగా కార్మికులు సిఐటియు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహిస్తూ కాలేజీ, కళాజ్యోతి, ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా గాంధీసర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆయూబ్‌ఖాన్‌, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి రమణ, పోలా లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కార్మికసంఘం గౌరవసలహాదారులు పెద్దక్క, వెం కటేశులు, చెన్నకేశవులు, లక్ష్మీఓబుళేసు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం : మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని సిఐటియు, టిడిపి నాయకులు అన్నారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రాష్ట్ర నిరవధిక సమ్మె ఆరవ రోజులో భాగంగా ఆదివారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యలయం ముందు ఉన్నా బైపాస్‌ రోడ్డులో అర్ధ నగ ప్రదర్శనతో దీక్షా శిబిరం వరకు మోకాళ్లతో ర్యాలీ చేపట్టారు. వీరికి టిడిపి కౌన్సిలర్లు, నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున, జగదీష్‌, టిడిపి పట్టణ అధ్యక్షులు, కౌన్సిల్‌ ప్రతిపక్ష నేత రమేష్‌కుమార్‌, కౌన్సిలర్లు సతీష్‌ కుమార్‌, భారతీ, నాయకులు సుమో సీనా, అమర్నాథ్‌, దుర్గా నవీన్‌, నాగేంద్ర, మోతకు పల్లి ఆనంద్‌, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️