పుట్టపర్తి వాసికి రాష్ట్రపతి అవార్డు

Dec 3,2023 22:10

  రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సాయి కౌస్తువ్‌ దాస్‌ గుప్తా

       పుట్టపర్తి క్రైమ్‌ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆదివారం జరిగిన ప్రతిష్టాత్మక వేడుకల్లో దివ్యాంగజన్‌ 2023 సాధికారత కోసం జాతీయ అవార్డును పుట్టపర్తికి చెందిన సాయి కౌస్తువ్‌ దాస్‌గుప్తాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత రాష్ట్ర మంత్రులు రాందాస్‌ అథవాలే, ఎ. నారాయణస్వామి, ప్రతిమా భూమిక్‌ తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు వీల్‌ చైర్‌ వారియర్‌ యాక్సెసిబిలిటీ, ఇన్‌క్లూజన్‌ రంగంలో తన అసాధారణమైన సహకారానికి గుర్తింపు పొందిన దాస్‌గుప్తా గ్లోబల్‌ టేడ్‌ ఎక్స్‌ మోటివేషనల్‌ స్పీకర్‌, 90 శాతం లోకోమోటర్‌ వైకల్యం ఉన్న వ్యక్తి. ఈయన దివ్యాంగజన్‌ విభాగంలో వ్యక్తిగత నైపుణ్యానికి జాతీయ అవార్డును అందుకున్నారు. ఆస్టియోజెనిసిస్‌ ఇంపెర్ఫెక్టా, చాలా అరుదైన పెళుసు ఎముక వ్యాధి, తీవ్రమైన వినికిడి లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సాయి కౌస్తువ్‌ నాయకత్వ లక్షణాలతో ప్రపంచ చిహ్నంగా ఎదిగారు. అతని సానుకూల దక్పథం, నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. గిన్నిస్‌, లిమ్కా వరల్డ్‌ రికార్డ్‌లు కలిగి ఉన్న దాస్‌గుప్తా ఇప్పటి వరకు వివిధ వేదికలపై 500 పైన అవార్డులను అందుకున్నారు. ఆయన జీవిత కథ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది.

➡️