పేదలపై ఎందికింత నిర్లక్ష్యం..?

సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో బైటాయించి నిరసన తెలుపుతున్న పేదలు

        పెనుకొండ : పెనుకొండ పట్టణంలో ఇళ్ల పట్టాలు లేని పేదలు ఏళ్ల తరబడి వినతిపత్రాలు అందిస్తున్నా సమస్యను పరిష్కరించకుండా అధికారులు ఎందికింత నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలు వ్యకాసం ఆధ్వర్యంలో మంగళవారం నాడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఏవో ఛాంబర్‌లో బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ పట్టాలివ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పేదలు అనేక సార్లు అధికారులకు వినతులు అందించినా వారి నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. పట్టణంలో సొంత ఇళ్లు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీరి సమస్యలను అధికారులు గుర్తించాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల సమస్యపై సబ్‌కలెక్టర్‌ మాట్లాడేందుకు రమ్మని చెప్పి కార్యాలయంలో లేకుండా క్యాంపునకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదల ఇళ్ల పట్టాల సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, తిప్పన్న, పట్టణ వ్యవసాయ కార్మిక మహిళ నాయకులు జయంతి, మనీ, దివ్యభారతితో పాటు పేదలు పాల్గొన్నారు.

➡️