ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

Jan 22,2024 21:55

అర్జీదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌

                          పుట్టపర్తి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన జగనన్న కు చెబుదాం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగరేఖ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వాటిని పారదర్శకంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. పకడ్బందీగా కుల గణన సర్వే :జిల్లాలో కులగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఎంపిడిఒలు, తహశీల్దార్లతో సమీక్షించారు. జిల్లాలోని 544 సచివాలయాలలో 9,851 క్లస్టర్లు ఉన్నాయన్నారు. మొత్తం 6,17,784 కుటుంబాలు జిల్లాలో ఉన్నాయన్నారు. కుల గణన సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్లు తప్పనిసరిగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 19 నుంచి చేపట్టిన కుల గణన ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 19 నుంచి జిల్లాలో కుల గణన ప్రతిష్టాత్మకంగా పగడ్బందీగా అమలు చేస్తున్నామని అందుకు ఎంపీడీవోలు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కుల గణనను పూర్తి చేయడం ద్వారా సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా అన్ని పథకాలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అధికారులందరూ ఇంటింటికి వెళ్లి సర్వే సక్రమంగా జరగడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 2 లక్షల కుటుంబాల వివరాలు ఇప్పటికే స్వీకరించడం జరిగిందని కుటుంబ యజమానితో వేలిముద్ర తీసుకొని వివరాలను నమోదు చేస్తున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు మండల ప్రత్యేక అధికారులు ఎంపిడిఒలు కులగణనపై సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలో జనాభా 18,69,478 మంది జనాభా ఉన్నట్లు ప్రాథమిక సర్వే వల్ల తెలిసిందన్నారు. ఈ సర్వేలో 9,850 వాలంటీర్లు, 5,440 పంది సచివాలయ ఉద్యోగులు పాల్పంచుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️