ఫలించిన పేదల పోరాటం

ఫలించిన పేదల పోరాటం

అధికారుల గుర్తించిన స్థలాన్ని పరిశీలిస్తున్న సిపిఎం, వ్యకాసం నాయకులు

   గోరంట్ల రూరల్‌ : ఇళ్ల పట్టాల కోసం సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామానికి చెందిన పేదలు చేసిన నిరసన పోరాటం ఫలించింది. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ముందుకు వచ్చారు. పాలసముద్రం గ్రామానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు, పట్టాదారులు, స్వాధీన అనుభవదారులు సోమవారం నాడు మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ స్పందించి రెండు రోజుల్లో గ్రామాన్ని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం పాలసముద్రం సర్వేనెంబర్‌ 125లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఆర్‌ఐ సమక్షంలో గ్రామ సర్వేయర్‌, విఆర్‌ఒ చేత సరిహద్దు కొలతలు వేసి గుర్తించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ పేదలందికీ ఇళ్ల పట్టాలు కేటాయించాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులకు న్యాయం చేయాలని కోరారు. నామమాత్రపు సర్వే చేసి వదిలేస్తే పేదలతో కలిసి మరోసారి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తహశీల్దార్‌ స్పందిస్తూ మండల సర్వేయర్‌ వస్తారని తప్పకుండా పూర్తిస్థాయి సర్వే చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, సిపిఎం నాయకులు కొండా వెంకటేశులు, స్థానికులు వెంకట లక్ష్మమ్మ, రామలక్ష్మమ్మ, సుకన్య తదితరులు పాల్గొన్నారు.

➡️