ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

Feb 6,2024 09:35

ఫిర్యాదుదారునితో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

            పుట్టపర్తి అర్బన్‌ : వివిధ సమస్యలపై స్పందన గ్రీవెన్స్‌లో ప్రజలు అందించే ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డిఆర్‌ఒ కొండయ్యతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 278 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడతూ స్వీకరించిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలంలోగా వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు మళ్లీమళ్లీ రీఒపెన్‌ కాకుండా చూడాలన్నారు. కులగణన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో కొత్తగా ఎంపిడిఒలు, తహశీల్దార్లు బాధ్యతలు స్వీకరించారన్నారు. ఎన్నికలకు సంబంధించి ఆఫీసర్లు, సెక్టర్‌ ఆఫీసర్లు, పోలింగ్‌ స్టేషన్లలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయో లేదో క్షేత్రస్థాయిలో గుర్తించి నివేదికలను ఈనెల 9వ తేదీలోపు తనకు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. 9వ తేదీన ఎన్నికల సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, గ్రామ, వార్డు సచివాలయ నోడల్‌ అధికారి శివారెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️