బిల్లులు చెల్లించమంటే కేసులు పెట్టారు..!

బిల్లుల కోసం కమిషనర్‌కు వినతిని ఇస్తున్న గుత్తేదారులు (ఫైల్‌ ఫోటో)

        హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం వ్యాప్తంగా 15 మంది గుత్తేదారులు గత ఏడు నెలల కాలంగా పట్టణ వ్యాప్తంగా వివిధ అభివద్ధి పనులు చేపట్టారు. దానికి సంబంధించి సుమారు రూ.3 కోట్ల వరకు పురపాలక సంఘం అధికారులు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లులను చెల్లించక పోగా డబ్బులు ఖర్చు చేసి పనులు చేసిన గుత్తేదారులపై మున్సిపల్‌ అధికారులు కేసులు పెట్టారు. దీంతో గుత్తేదారులు అధికారులపై విజిలెన్స్‌, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. హిందూపురం పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న అకౌంట్స్‌, ఫ్రీ ఆడిట్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం గుత్తేదారులు చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు సుమారు రూ.3 కోట్ల వరకు నిలచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న గుత్తేదారులు ఒక్క సారిగా ఆగ్రహానికి గూరై సోమవారం నాడు అకౌంట్‌ సెక్షన్‌ గదిలో ఓ అధికారి బల్లమీద ఉన్న అద్దాన్ని పగుల కొట్టారు. బల్ల మీద ఉన్న కాగితాలు, కంప్యూటర్‌ మానిటర్‌ను బల్ల మీదే పడేశారు. లక్షలాది రూపాయలను అప్పు చేసి పట్టణంలో సిసి రోడ్లు, సిసి డ్రెయినేజీ తదితర అభివృద్ధి పనులను గుత్తేదారులు చేశారు. వీటికి సంబంధించి ఇంజినీరింగ్‌ అధికారులు ఎం రికార్డు చేసి, బిల్లును అకౌంటింగ్‌ విభాగానికి పంపారు. వాటిని పరిశీలన చేసి అన్ని బిల్లులు సిఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు అకౌంటింగ్‌, ప్రీ ఆడిట్‌ అధికారులు సమన్వయంతో బిల్లును మంజూరు చేయాల్సి ఉంది. అయితే అధికారుల సమన్వయ లోపంతో బిల్లుల మంజూరు కాలేదు. అధికారులు చేసిన నిర్లక్ష్యానికి తామందరం అప్పుల పాలై రోడ్డున పడ్డామని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఆవేశంలో చేసిన చిన్న తప్పును పట్టుకుని తమపై కేసులు నమోదు చేయడంపై వారు మరింత ఆగ్రహానికి గూరవుతున్నారు. అకౌంటింగ్‌ సెక్షన్‌ అధికారులు ఓ గుత్తేదారుడి పేరుతో ఉన్న బిల్లులను మరో గుత్తేదారు పేరుతో అప్లోడ్‌ చేశారని, ఇది కాకుండా మరికొందరు అధికారులు ఏమి చేశారో అన్ని అధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటితో విజిలెన్స్‌, ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్దం అవుతున్నామని గుత్తేదారులు చెబుతున్నారు.

గుత్తేదారులకు కేసుల బహుమతి

        హిందూపురం పురపాలక సంఘంలో గత 7నెలల కాలంగా జరిగిన బిల్లులు మార్చి నెలలో అన్నీ మంజూరు అవుతాయని గుత్తేదారులకు ఎదురు చూశారు. బిల్లులు మంజూరు కాక పోగ ఎదురు చూస్తున్న గుత్తేదారులకు కేసులు బహుమతిగా లభించాయి. ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో పారదర్శకత తీసుకురావాలని సిఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానమే గుత్తేదారులకు శాపంగా మారింది. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సాధరణ నిధులకు సంబందించిన ఖాతాలన్ని సిఎఫ్‌ఎంఎస్‌లోకి వస్తాయి. చేసిన పనులకు బిల్లులు సకాలంలో మంజూరు కాక పోవడం, గట్టిగా అడిగినందుకు కేసులు పెట్టడంతో గుత్తేదారులు అభివృద్ధి పనులు చేయమని చేతులెత్తేశారు. దీంతో పురపాలక సంఘాల్లో అత్యవసరమైన చిన్నచిన్న పనులు చేయడానికి సైతం ఎవరూ ముందుకు రావాడం లేదు. మొత్తం మీద హిందూపురం మున్సిపాల్టీలో ఇంజినీరింగ్‌, అకౌంటింగ్‌, ప్రీ ఆడిట్‌ సెక్షన్ల మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు పూర్తి చేసిన గుత్తేదారులు నిండా మునిగిపోవడంతో పాటు పోలీస్‌ కేసులు బహుమతిగా లభించాయి.

➡️