బ్రహ్మోత్సవాలకు పట్టిష్ట భద్రత : ఎస్పీ

ఖాద్రీశుని ఆలయంలో ఎస్పీ మాధవరెడ్డి దంపతులు

       కదిరి టౌన్‌ : కదిరి పట్టణంలో జరుగబోయే శ్రీమత్‌ ఖాద్రీలక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మాధవరెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై గురువారం నాడు పోలీసు సిబ్బందితో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు ఎలాంటి అటంకాలూ లేకుండా భద్రతపరమైన చర్యలు చేపట్టాలన్నారు. గత అనుభవాలను పోలీసు దష్టిలో ఉంచుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. 30న జరిగే రథోత్సవ వేడుకలకు పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తొక్కిసలాట జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా, హుందాగా మెలగాలన్నారు. వాహనాల పార్కింగ్‌ను నిర్ధేశిత ప్రాంతంలోనే చేయించాలన్నారు. ఉత్సవాలు ముగిసేంత వరకు నిరంతర నిఘాను కొనసాగించాలన్నారు. అంతుకు మునుపు ఎస్పీ దంపతులు ఖాద్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీలత, సిఐలు పుల్లయ్య, వెంకటేశ్వర్లు, మోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️