ముఖ్యమంత్రికి రైతుల నిరసన సెగ

పుట్టపర్తి విమానాశ్రయం ముందు భవనంపై నుంచి ఫ్లెక్సీలు ప్రదర్శించి నిరసన తెలుపుతున్న మడకశిర ప్రాంత రైతులు

         పుట్టపర్తి రూరల్‌ : అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆదివారం మధ్యాహ్నం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న సిఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు మడకశిర ప్రాంతానికి చెందిన రైతులు పోలీసులు అనుమతి కోరారు. సమస్యలపై వినతిపత్రం అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో రైతులు పుట్టపర్తి విమానాశ్రయం ముందు ఓ భవనంపైకి ఎక్కి పోస్టర్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. భవనంపైన నిరసన తెలుపుతున్న వారిని సైతం పోలీసులు వదలకుండా బలవంతంగా వారిని అక్కడి నుంచి కిందకు దింపేశారు. ఈ సమయంలో రైతులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. వారిని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి బుక్కపట్నం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు వారిని అక్కడే ఉంచి అనంతరం విడుదల చేశారు. రైతు సమస్యలను ముఖ్యమంత్రికి చెబుదామని వస్తే ఇలా అడ్డుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇలా అడ్డగింపులను ఆపి రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. సాగునీరు లేక మడకశిర ప్రాంతంలో రైతులు జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పంటల సాగు నిమిత్తం మడకశిర బ్రాంచి కెనాల్‌కు నీరివ్వాలన్నారు. పట్టుగూళ్ల విక్రయాల్లో రైతులకు ఇస్తున్న కిలోకి 50 రూపాయలు ప్రోత్సాహం రూ.4 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణం విడుదల చేయాలని కోరారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు.

➡️