వార్డుల్లో తిరగలేం..

ఛైర్‌పర్సన్‌ పోడియం ముందు బైఠాయించిన అధికార పార్టీ కౌన్సిలర్లు

     హిందూపురం : ‘పురపాలక సంఘం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ వార్డుల్లో కనీన అభివద్ధి సైతం చేపట్ట లేదు. వార్డు వర్యటనకు వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారు. అభివద్ధి చేయక పోతే ఇక వార్డుల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు’… అంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముగళవారం నాడు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్‌ సాధరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 15 అంశాల్లో కూడిన అజెండాను కౌన్సిల్‌ దష్టికి తీసుకొచ్చారు. ఇటీవల మతి చెందిన మాజీ కౌన్సిలర్‌, రోడ్డు ప్రమాదంలో మతి చెందిన సచివాలయ సెక్రటరీలకు నివాళులు అర్పించారు. అనంతరం అజెండాపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఇర్షాద్‌, నాసిరబాను, అసిఫ్‌, రహమత్‌ బి, నాగేంద్రమ్మ అభివద్ధి విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ వార్డుల్లో కౌన్సిల్‌ ఆమోదం తెలిపినప్పటికీ ఏమాత్రం అభివద్ధి పనులు జరగడం లేదన్న విషయాన్ని చాలాసార్లు కౌన్సిల్‌, అధికారుల దష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదన్నారు. వెంటనే సంభందిత గుత్తేదారులతో చర్చించి పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఛైర్‌పర్సన్‌ పోడియం ముందు బైఠాయించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు పలు సమస్యలపై నిలదీశారు. ఇరు పార్టీ కౌన్సిలర్లకు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, వారు వినకపోవడంతో సమావేశాన్ని ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం అయింది. అజెండాపై చర్చించాల్సిన అధికార పార్టీ కౌన్సిలర్లు అజెండాలో ఉన్న అన్ని అంశాల పైనా డీసెంట్‌ తెలుపుతూ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజకు లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఛైర్‌పర్సన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము వార్డు కౌన్సిలర్లుగా ఎంపిక అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస అభివద్ధి పనులు సైతం వార్డుల్లో చేపట్టలేదన్నారు. తమ వార్డుల్లో పరిస్థితి ఇలా ఉంటే 35వ వార్డులో మాత్రం కోట్లాది రూపాయలతో అభివద్ధి పనులు చేశారన్నారు. కొంతమంది కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రమే అభివద్ధి పనులు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష కౌన్సిల్‌ నేత రమేష్‌ కుమార్‌, టిడిపి కౌన్సిలర్లు మాట్లాడుతు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు వారు చేస్తున్న అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని భయపడి ప్రతి సమావేశంలోనూ అల్లర్లను సష్టించి సమావేశాలు వాయిదా పడే విధంగా చేస్తున్నారన్నారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్‌ అధికార పార్టీ కౌన్సిలర్లకు అవినీతి సామ్రాజ్యం అన్నారు. ప్రవేట్‌ బస్టాండ్‌ లో కొంత స్థలాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా కూరగాయల టోకు వ్యాపారులకు కేటాయించారు. వీటిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రశ్నిస్తారని భయపడి అజెండాపై, ఆగిన అభివద్ధి పనుల పైన చర్చించకుండానే సమావేశానికి వచ్చినట్టు సంతకాలు పెట్టేసి వెళ్తున్నారన్నారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలని అధికార పార్టీ పాలకవర్గంకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

➡️