వైసిపి పాలనకు చరమ గీతం : పల్లె

Jan 30,2024 22:18

పార్టీలోకి చేరిన వారికి కండూవాలు కప్పుతున్న పల్లె

                   పుట్టపర్తి అర్బన్‌ : వైసిపి పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీకి చరమ గీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం టిడిపి స్థానిక కార్యాలయంలో ఓడిసి మండలం నల్లగుట్లపల్లి గ్రామానికి చెందిన 11 వైసీపీ కుటుంబాలు పల్లె సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి పల్లె టిడిపి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ ఈ నాలుగున్నర ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి జీవోలు లేకుండా నిధులు మంజూరు కాకుండానే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు మంజూరు అయిందని డబ్బా కొట్టుకుంటూ ఇటీవల ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2024 ఎన్నికలలో టిడిపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టు తీర్పు జగన్‌కు చెంపపెట్టు : చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఒక్కటైన జగన్‌ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి అన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. చంద్రబాబు ముందస్తు బెయిలు రద్దు చేయాలని, ప్రభుత్వం వేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని ఈ తీర్పు జగన్‌ కు చెంపపెట్టు లాంటిది అని అన్నారు.

➡️