సాయమేదీ లేదు… ప్రచారం తప్ప

Jan 23,2024 22:06

వైఎస్‌ఆర్‌ ఆసరా మెగా చెక్కు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

               అనంతపురం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కరువుపై స్పందిస్తారని అందరూ ఆశించారు. కాని ఈ ప్రస్తావనే లేకుండానే ఆయన పర్యటన సాగింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిచడంతోపాటు, ప్రతిపక్ష టిడిపి, ఇతర పార్టీలను విమర్శించడంతోనే సరిపోయింది. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం నాడు అనంతపురం జిల్లాకు విచ్చేశారు. ఉరవకొండలో జరిగిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు వైఎస్‌ఆర్‌ అసరా పథకం కింద రూ.6394 కోట్లను బటన్‌ నొక్కి ఆయా సంఘాలకు నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల సందర్భంలో సాగిన ఈ యాత్ర పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమంగానే నడించింది. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి పుట్టపర్తికి విచ్చేసిన ఆయనకు సత్యసాయి జిల్లా నేతలు అక్కడ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుట్టపర్తికి సంబంధించిన టిక్కెట్ల అంశాన్ని ఒకరిద్దరు నేతలు ముందుకు తీసుకురావడంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అనంతరం హెలీక్యాప్టర్‌లో ఉరవకొండకు చేరుకున్నారు. ఉరవకొండలో జరిగిన సభలో నియోజకవర్గంకు సంబంధించి కొన్ని సమస్యలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిల్లో కొన్నింటినీ వేగవంతంగా అమలు చేస్తామని హామీనిచ్చారు. అంతకు మంచి కొత్త అంశాల ప్రస్తావేది ముఖ్యమంత్రి ప్రసంగంలో లేదు. ప్రధానంగా 2023లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పంటనష్టం అంచనాలను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఈ పరిహారం మంజూరుపై ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ప్రకటిస్తారని ఆశించారు. కాని కరువు పరిస్థితులకు సంబందించి కనీస ప్రస్తావేది లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించే ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతును నిలిచే స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని ఆరోపించారు. తనకు ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు అంటూ ఒక రకంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైసిపికి మద్దతుగా ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని పరోక్షంగా సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం వైసిపి నాయకులతో చాలా సమయం గడిపారు. ముందుస్తుగానే పాసులు పొందిన వారు ఆయన్ను కలవడానికి పోటీపడ్డారు. వారందరితోనూ ఆయన కలిశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి మంత్రి ముత్యాల నాయుడు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌, విద్యుత్‌, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, శంకర నారాయణ, ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టరు గౌతమి తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే…

 ఉరవకొండ : సిఎం జగన్మోహన్‌రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతేనని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఉరవకొండలో నిర్వహించిన వైస్సార్‌ ఆసరా కార్యక్రమంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. సిఎం జగన్‌ చెప్పితే చేస్తాడంతేనని అన్నారు. ఈ రోజు రాష్ట్రమంతా మన ఉరవకొండ వైపు చూస్తోందని మహిళా సంఘాల సభ్యులు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఇన్‌పుట్‌ సబ్సిడీపై మాట్లాడానని చెప్పారు. ఆసమయంలో సిఎంగా ఉన్న చంద్రబాబు అది కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు అని, తాము ఇవ్వమని అన్నారని అన్నారు. అయితే వైసిపి ప్రభుత్వంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి జగన్‌ మాత్రం మహిళల రుణాలకు సంబందించి రూ. 25 వేల కోట్లను ఇచ్చారని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు పథకాలు అందుతున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అనుసరిస్తున్న విధానాలను ఈసందర్భంగా ఎండగట్టారు. నాలుగున్నరేళ్ళుగా ప్రజలకు ముఖం చూపకుండా సైబీరియా నుంచి వలస పక్షులు వచ్చినట్లు ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి దండాలు పెడతాడని ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను సభలో ప్రస్తావించిన విశ్వేశ్వరరెడ్డి ఆ సమస్యలను పరిష్కరించాలని సభాముఖంగా ముఖ్యమంత్రికి విన్నవించారు. నియోజకవర్గానికి వరాల జల్లు : ఉరవకొండ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వరాల జల్లు కురిపించారు.మంగళవారం వైస్సార్‌ ఆసరా కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి సిఎం దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్ళగానే వాటిని అక్కడి అక్కడే ఆమోదించారు. వీటిలో ముంపునకు గురైన బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ పునర్నిర్మించడానికి అవరమయ్యే చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ముంపు గ్రామాన్ని రూ.88 కోట్లతో ఆదుకోకున్నట్లు తెలిపారు.హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా 75 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీ పనులకు రూ.68 కోట్లు మంజురుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. దీంతో పాటు పెన్నహౌబిళంలో బీసీ బాలుర రెసిడెన్షియల్‌ స్కూలు నిర్మాణానికి రూ.33 కోట్లు మంజురు చేస్తున్నట్లు తెలిపారు. ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో 12 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజురు చేస్తున్నట్లు సిఎం జగన్మోహన్‌ రెడ్డి వెల్లడించారు.దీంతో 210 కోట్ల రూపాయలు పనులకు ముఖ్యమంత్రి ఆమోదించినట్లు అయ్యింది. దీనిపై విశ్వేశ్వరరెడ్డి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు

➡️