సాహిత్యంతో నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళదాం

Mar 3,2024 22:11

సమావేశంలో మాట్లాడుతున్న సడ్లపల్లి చిదంబరరెడ్డి

                           పెనుకొండ : రాయలసీమ జిల్లాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను సాహిత్యం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామని సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ పిలుపునిచ్చారు. పెనుకొండ పట్టణంలోని గగన్‌ మహల్‌ ఆవరణంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం జలకవనం నిర్వహించారు. సాహితీస్రవంతి జిల్లా కన్వీనర్‌ ఏ. హరి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశ రథ రామిరెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర ఆధ్యక్షులు కెంగార మోహన్‌, ఏలూరి యంగన్న, సడ్లపల్లి చిదంబర రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో దశాబ్దాలుగా నీటి సమస్య ఉందన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో నీటి సమస్యల పరిష్కారంలో పాలకులలో చిత్తశుద్ధి లేకపోవడంతో సమస్య జఠిలమైందన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడం, వర్షపు నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం లేకపోవడం వలన నీటి ఎద్దడి రోజు రోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జలకవనంలో జరిగే సాహిత్యం ద్వారా నీటి సమస్యలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాల కళ్లు తెరిచే విధంగా కవితలు, పద్యాలు, పాటలు ఉండాలన్నారు. కవులు, రచయితల పాటలు, పద్యాలు, కవితలు రాయలసీమ ఎదుర్కొంటున్న నీటి కరువు గురించి కారణాలు ఏమిటో ప్రతిబింబించాలన్నారు. రాయలసీమకు అడుగుతున్న నీటి హక్కులు ప్రాంతీయ తత్వం కాదన్నారు. రాయలసీమ నీటి సంక్షోభం సాహిత్య ప్రభావాన్ని గురించి సడ్లపల్లి, మోహన్‌ ఈసందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమం లో రాయలసీమ జిల్లాలనుంచి వచ్చిన కవులు, గాయకులు తమ కవితలను, పద్యాలను, పాటలను వినిపించారు. అనంతరం నిర్వాహకులు కవులకు, గాయకులకు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి కవులు, కళాకారులు, సాహితీ స్రవంతి సభ్యులు రాజశేఖర్‌, కోగిర జయచంద్ర, రామన్న, యుటిఎఫ్‌ నాయకులు సుధాకర్‌, నారాయణ స్వామి, రమేష్‌, మేధావులు, ప్రముఖులు పాల్గొన్నారు.

➡️