ఎన్నికల వేళ నాయకులు అటు..ఇటు..!

       అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నాయకులు సుడిగాలి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్ధేశంతో సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు. ఈ సమయంలో పక్క పార్టీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు గాలం వేస్తున్నారు. ఎలాగైనా వారిని తమ వైపు తిప్పుకుని వారి వద్ద ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. జిల్లాలో టిడిపి, వైసిపి రెండు పార్టీలూ ఈ పద్ధతిని చాలా వేగంగా కానిస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కండువాలు అటు.. ఇటు మారుతున్నాయి. కొందరు నాయకులు అయితే ఉదయం ఒక పార్టీలో రాత్రి మరొక పార్టీలో ఉంటున్నారు. అభ్యర్థులు అయితే తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని తెలిసేలా చేరికలను ప్రోత్సహిస్తూ తమ బలం పెరిగింది అనేలా ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోటీ హోరాహోరీగానే సాగుతోంది. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించేయడం, నామినేషన్ల కంటే ముందుగానే ఒక విడత ప్రచారం ముగించడం లాంటి కార్యక్రమాలతో పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసొచ్చే నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. గతంలో వారితో ఎంతటి వైరం ఉన్నా వాటిని పక్కన బెట్టి వారి పార్టీ కండువాను వేసేస్తున్నారు. దీంతో రాత్రికిరాత్రే సమీకరణాలు మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని ఇదే పరిస్థితి కన్పిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా ప్రతి రోజు కండువాలు కప్పే కార్యక్రమాన్ని ఒక దినచర్యగా చేస్తున్నారు. ప్రతి రోజూ వార్డుల వారీగా తమ పార్టీలో చేరుతున్నారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్య నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పార్టీలు మారుతుండడం గమనార్హం. ఈ మధ్యనే అనంతపురం అర్బన్‌, కదిరి, హిందూపురం, తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏకంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. అదే క్రమంలో టిడిపి నుంచి వైసిపిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు గుంతకల్లు నియోజకవర్గంలో ఏకంగా ఐదుగురు వైసిపి తాజా కౌన్సిలర్లు, ఒక మాజీ కౌన్సిలర్లు ఆపార్టీని వీడి టిడిపిలో చేరారు.

భవిష్యత్తుపై భరోసా

       పార్టీలు మారే సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నాయకులకు భారీ ప్యాకేజీలను హామీల రూపంలో గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని, నగదు సాయం చేస్తామని, పోలీసు కేసులు కొట్టి వేయిస్తామనే హామీలతో ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులను వారివైపు తిప్పుకుంటున్నారు. కండువాలు మార్చే క్రమంలో కుల సమీకరణలు కూడా భారీగా కన్పిస్తున్నాయి. ఆ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకున్ని గుర్తించి వారి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్న కుల రాజకీయ నాయకులు పార్టీల్లోకి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొత్త వారిని పార్టీలోకి తీసుకునే సయమంలో అప్పటికే పార్టీలో ఉన్న స్థానిక నాయకులు కొత్తగా చేరేవారిని వ్యతిరేకిస్తున్నారు. ఉదయం ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సాయంత్రం సరికి ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోతున్నారు. గంటల వ్యవధిలోనే నాయకుల కండువాలు ఇట్టే మారుతున్నాయి. కనీస ప్రభావం చూపే నాయకున్ని ఎవరినీ వదలకుండా లాగేందుకు టిడిపి, వైసిపి రెండూ గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.

ముఖ్యనేతలు సైతం కండువాలు మార్చేస్తున్నారు..!

          ద్వితీయ శ్రేణి నాయకులే కాదు.. ఏకంగా టికెట్‌ ఆశించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు సైతం పక్క పార్టీలోకి దూకేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణదుర్గం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆ పార్టీని వీడిని వైసిపిలో చేరారు. ఇక హిందూపురం వైసిపి మాజీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ సైతం ఆ పార్టీకి గుడ్‌పై చెప్పి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. కదిరిలో అత్తార్‌ చాంద్‌బాషా టిడిపిని వీడి వైసిపిలో చేరారు. రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసిపిని విభేదించి బిజెపిలో చేరారు. ఇలా గత రెండు వారాల్లో పదుల సంఖ్యలోనే ముఖ్య నాయకులు పక్క పార్టీలోకి దూకేశారు.

➡️