‘సుధాకర్‌ను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం

Apr 13,2024 22:16

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సిడబ్ల్యూసి మెంబర్‌ రఘువీరారెడ్డి

                      మడకశిర :ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ‘సుధాకర్‌ను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపి స్తాం’ అని సిడబ్ల్యుసి మెంబర్‌ రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన శనివారం రొళ్ల మండలంలోని ఎం.రాయపురం, ఎంఆర్‌.గొల్లహట్టి, సోమగట్ట, చిగమతిగట్ట, బద్రేపల్లి, హులికుంటే, దొమ్మరహట్టి, ఆర్‌.గొల్లహట్టి, రొళ్లకొండ. ఆర్‌.వడ్రహట్టి, హనుమంతనపల్లి, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం, గతంలో టిడిపి సర్కార్‌ మడకశిర అభివృద్ధిని విస్మరించాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకున్న పరిచయాలతో నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రతి ఇంటికీ శ్రీరామిరెడ్డి తాగునీటి కుళాయి, రేకులకుంట గ్రామ సమీపంలో సేకరించిన 1600 ఎకరాల భూమిలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, హంద్రీనీవా కాలువ ద్వారా నియోజకవర్గంలోని 320 చెరువులకు నీరు, రైల్వే లైన్‌ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని ఎం.ఆర్‌.గొల్లహట్టి గ్రామంలో వైసిపికి చెందిన దాసప్ప, చిక్క కరియన్న, కృష్ణప్ప, రాజన్న, పూజారి చిక్కన్న, నాగరాజు, బోడ చిక్కప్ప, శివన్న, చిగమతిగట్ట, గొల్లహట్టి గ్రామంలో టిడిపి నుంచి రాజన్న, చిత్తప్ప, బద్రేపల్లి గొల్లహట్టి గ్రామంలో వైసిపి నుంచి వార్డ్‌ మెంబర్‌ మాలింగప్ప, ఆర్‌.గొల్లహట్టి గ్రామంలో టిడిపి నుంచి శివన్న, గోవిందప్ప కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️