శాంతి ప్రేమలకు ప్రతిరూపం బుద్ధుడు

May 23,2024 20:53

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రత్నాకర్‌ తదితరులు

                    పుట్టపర్తి అర్బన్‌ :శాంతి, ప్రేమ, కరుణ, దయకు ప్రతిరూపం బుద్ధ భగవానుడని గ్లోబల్‌ బుద్ధ పౌర్ణిమ కోఆర్డినేటర్‌ వాసుదేవ్‌ ఖిలాని పేర్కొన్నారు. గురువారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌ హాలులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సింగపూర్‌, మలేషియా, ఇండోనేషియా, జపాన్‌, తైవాన్‌, లావోస్‌, శ్రీలంక, నేపాల్‌ దేశాల నుంచి పలువురు బౌద్ధ సన్యాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఊరేగింపుగా వారు సాయి కుల్వంత్‌ హాలుకు చేరుకున్నారు. మొదట వారి సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలనలో సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్‌ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుద్ధుడు చూపిన మార్గంలో పయనించాలన్నారు. మరో అతిధి భిక్షుఉత్తరో మాట్లాడుతూ కరుణ దయ చూపడం వంటి సద్గుణాన్ని ఆచరించడం వల్ల భాగోద్వేగ సమతుల్యం పాటించవచ్చన్నారు. అనంతరం బుద్ధ భగవాన్‌ విగ్రహానికి అభిషేకం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవద్‌ కిషన్‌ రావు, పలువురు బౌద్ధులు పాల్గొన్నారు.

➡️