ఉమ్మడి అనంతలో వైసిపికి పలువురు గుడ్‌బై

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న ముదిగుబ్బ ఎంపిపి ఆదినారాయణయాదవ్‌

         అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసిపికి పెద్ద షాక్‌ తగిలింది. పలు ప్రాంతాల్లో ఆ పార్టీ మఖ్య నేతలు వైసికి గుడ్‌బై చెప్పారు. శింగనమలలో మాజీ ఎమ్మెల్యే యామినీబాల, ముదిగ్బులో ఎంపిపి, తనకల్లులో మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ తదితరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార పార్టీలో తమకు గుర్తింపు లేకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు రాజీనామా చేసిన నాయకులు ప్రకటించారు.మాజీ ఎమ్మెల్యే యామినిబాల నార్పల : అనంతపురం జిల్లా శింగనమల మాజీ ఎమ్మెల్యే వైసిపికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె శనివారం నాడు అనంతపురం నుంచి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వైసిపి శింగనమల టికెట్‌ వ్యవహారంపై గత నెల రోజులుగా తీవ్ర అసమ్మతి నెలకొంది. వీరాంజినేయులకు టికెట్‌ ఇవ్వడాన్ని వైసిపి అసమ్మతి నేతలు నిరసిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా అభ్యర్థిని మార్చకపోవడంతో అసమ్మతి నేతలు ఇప్పటికే రాజీనామా చేస్తామని ప్రకటించారు. తాజాగా యామినీబాల ఆపార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొందరు వైసిపి నాయకులు శింగనమల నియోజకవర్గంలో ఆ పార్టీకి రాజీనామాలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ముదిగుబ్బ ఎంపిపి ఆదినారాయణ యాదవ్‌…

                ముదిగుబ్బ : ముదిగుబ్బ వైసిపి నాయకుడు, ఎంపిపి ఆదినారాయణ యాదవ్‌ వైసిపిని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన నివాసంలో శనివారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతం, యువతకు మంచి చేయాలన్న ఆశయంతో వైసిపిలో చేరానని తెలియజేశారు. ఎంపిపిగా తాను బాధ్యతలు చేపట్టినా వైసిపిలోని కొందరు స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలు, కుతంత్రాలను జీర్ణించుకోలేక పోయాయనన్నారు. ఆ నాయకులు అభివద్ధి నిరోధక చర్యలకు పాల్పడడంతో అక్కడ ఉండలేకి పార్టీకి రాజీనామా చేశానని తెలియజేశారు. తాను వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీ అభివద్ధికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఎంతో కషి చేశానని తెలియజేశారు. గత ఐదు సంవత్సరాలుగా తన వ్యాపారాలు వదులుకుని ప్రజలకు సేవ చేయడానికి వచ్చానన్నారు. మండలంలో కొందరు దుష్టశక్తులుగా మారి ఈ ప్రాంతం అభివద్ధి, తన ఉన్నతికి ఆటంకాలు కల్పించారన్నారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయలేనని భావించి గత్యంతరం లేని స్థితిలో రాజీనామా చేస్తున్నట్ల తెలియజేశారు. త్వరలో భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

నంబులపూలకుంట మాజీ ఎంపీపీ…

             కదిరి టౌన్‌ : నంబులపూలకుంట మండల మాజీ ఎంపిపి హనుమంతరెడ్డి టిడిపిలో చేరారు. కదిరి టిడిపి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆయన టిడిపిలో చేరారు. నంబులపులాకుంట మండలం మరికందిన్నె పంచాయతీకి చెందిన హనుమంతు రెడ్డి గతంలో టిడిపిని వీడి వైసిపిలో చేరారు. తిరిగి ఆయన తన అనుచరులతో కలిసి సొంతగూటికి చేరారు. తనతోపాటు ముస్తఫా, లక్ష్మీనరసింహా, వెంకటప్ప, ముసలయ్య తదితరులు టిడిపిలో చేరారు. కందికుంట విసయానికి శక్తివంచన లేకండా కృషి చేస్తానంటూ హనుమంతరెడ్డి తెలియజేశారు.

తనకల్లు మార్కెట్‌యార్డు ఛైర్మన్‌

           తనకల్లు : మండల పరిధిలోని చీకటిమానిపల్లి, గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు, తనకల్లు మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ ఎన్‌.ఈశ్వర్‌ రెడ్డి వైసిపిని వీడారు. శనివారం నాడు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఈయన భార్య స్వర్ణలత తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీగా పని చేశారు. తరవాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైసిపిలో చేరారు. ప్రస్తుతం ఆపార్టీకి రాజీనామా చేసి తిరిగి టిడిపిలోకి వెళ్లనున్నారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.

➡️