‘రఘువీరారెడ్డిని విమర్శించే అర్హత ఎమ్మెస్‌ రాజుకు లేదు’

May 15,2024 21:38

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్‌

                  మడకశిర : సిడబ్ల్యూసి మెంబర్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డిని విమర్శించే అర్హత టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్‌ రాజుకు లేదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత రఘువీరారెడ్డికి దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ల నుండి పరిష్కారానికి నోచుకుని ఎన్నో కార్యక్రమాలను ఆయన పూర్తి చేశారన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా ఇప్పటికీ చాలా గ్రామాలలో నీరు చేరిందంటే అది ఆయన చేసిన కృషే నని అన్నారు. అదేవిధంగా శ్రీరామ్‌ రెడ్డి మద్దిలేటి పథకం ద్వారా ఎన్నో గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, రైల్వే లైనుకు కృషి చేశారని చెప్పారు. నియోజకవర్గంలో ఎంతోమంది పేద విద్యార్థుల కోసం కళాశాల ఏర్పాటు చేసిన ఘనత రఘువీరారెడ్డికి దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఏ బూత్‌లోనూ ఓట్లు పడలేదో అంతర్గత సమావేశాల్లో చర్చించాలేగాని లేనిపోని ఆరోపణలు రఘువీరారెడ్డి పై చేయడం తగదని అన్నారు. నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడతారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మందలపల్లి నాగరాజు, మంజునాథ్‌, గౌడప్ప, లోకేష్‌, గురుమూర్తి, బాబుతో పాటు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️