సకాలంలో ఫిర్యాదులకు పరిష్కారం : డిఆర్‌ఒ

అర్జీలను స్వీకరిస్తున్న డిఆర్‌ఒ కొండయ్య

      పుట్టపర్తి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 114 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏవో వసుంధర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సమస్యనూ పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. సుపరిపాలన అందించాలని సమర్ధత, అవినీతిరహిత వ్యవస్థ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మండల, మున్సిపాలిటీ, డివిజన్‌ స్థాయిలో వచ్చే అర్జీలను సంబంధిత కార్యాలయాల్లోని అధికారులు సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలను స్వీకరించే సమయంలో ఆధార్‌, ఫోన్‌ నెంబరు ఇచ్చేలా ప్రజలకు తెలపాలన్నారు. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో ఎక్కడ కూడా తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. డ్రెయినేజీలున్న ప్రాంతంలో నీటి పైపుల వల్ల లీకులు వల్ల నీరు కలుషితం అయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి వాటిని గుర్తించి డ్రెయినేజీలను మరమ్మతలు చేయించాలన్నారు. వర్షాకాలంలో ఎక్కడా నీటి నిలువలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 3న జిల్లాకు సంబంధించి సర్వసభ్య సమావేశం ఉంటుందని, అన్ని శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించి నివేదికను సిద్ధం చేసుకుని హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు.

➡️