కులం,మతంతో వైసిపి రాజకీయ చిచ్చు

విలేకరులతో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌

           కదిరి టౌన్‌ : రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలు ఎక్కడైతే అధికంగా ఉన్నారో ఆ నియోజక వర్గాలలో ఎన్డీఏ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కులం, మతం రంగు ప్రజలపై రుద్ది రాజకీయ లబ్ధి పొందడం కోసం వైసిపి ప్రయత్నిస్తోందని కదిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందికుంట మాట్లాడుతూ కదిరి నియోజకవర్గ ప్రజలు పుంగనూరు పెత్తనాన్ని సహించరన్నారు. వైసీపీ హయాంలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి టిడిపి కృషి చేస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే టిడిపి, జనసేన బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు. ఒక ఛాన్స్‌ పేరుతో అధికారం చేపట్టిన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరాచక పాలనను త్వరలోనే అంతం కానుందన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైసిపి ఓట్ల కోసం మైనార్టీలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని భరోసా కల్పించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు అందించామని, మిగిలిన చెరువులకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లను రూ.4000కు పెంచి ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని తెలియజేశారు. సూపర్‌-6 ద్వారా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన ఇన్‌ఛార్జి భైరవ ప్రసాద్‌, టీడీపీ నాయకులు పవన్‌ కుమార్‌ రెడ్డి, బిజెపి అసెంబ్లీ ఇన్‌ఛార్జి వేణుగోపాల్‌ రెడ్డి, జనసేన నాయకులు లక్ష్మన్న, అశ్వర్థ కుమార్‌, మహేష్‌ పాల్గొన్నారు.

➡️