అంగన్వాడీల ఆగ్రహొం16వ రోజుకు చేరిన సమ్మెొ

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతమవుతోంది. బుధవారానికి సమ్మె 16వ రోజుకు చేరుకోగా, సమ్మెలో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలను అంగన్వాడీలు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. శ్రీకాకుళం

శ్రీకాకుళం అర్బన్‌ : మంత్రి ధర్మాన క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు

ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాల ముట్టడి

వినతిపత్రాలు అందజేత

ప్రజాశక్తి – విలేకరుల యంత్రాంగం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతమవుతోంది. బుధవారానికి సమ్మె 16వ రోజుకు చేరుకోగా, సమ్మెలో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలను అంగన్వాడీలు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడులో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయం వద్ద పెద్దసంఖ్యలో అంగన్వాడీలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు మంత్రి గానీ, సిబ్బంది గానీ స్పందించలేదు. చివరకు మంత్రి పిఎస్‌ వచ్చి మంత్రి లేరని, ఈనెల 31న వస్తారని చెప్పారు. ఆందోళన విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లి తమకు నిర్దిష్ట హామీ ఇవ్వాలని సిఐటియు నాయకులు, అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందన లేకపోవడంతో కార్యాలయాన్ని ముట్టడించడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను ప్రతిఘటిస్తూ అంగన్వాడీలు ముందుకెళ్తుండడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అరెస్టులకు సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి తనయుడు రామ్‌మనోహర్‌ నాయుడు బయటకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్‌.వి రమణ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి జె.కాంచన, టి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పలాసలో కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు నుంచి అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లి రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి వచ్చే వరకు వెళ్లేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. అనంతరం అంగన్వాడీల వద్దకు వచ్చిన మంత్రి అప్పలరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, బి.ఆనందరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.మంజుల, బి.సునీత, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుంచి పూజారిపేటలోని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం నివాసం వరకు ర్యాలీగా వెళ్లిన అంగన్వాడీలు అక్కడ రెండు గంటల పాటు బైఠాయించారు. స్పీకర్‌ తనయుడు చిరంజీవి నాగ్‌ వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, పి.భూలక్ష్మి, పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలం బల్లిపుట్టుగలో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ నివాసానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త సాయిరాజ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి వారి వద్దకు వెళ్లగా విజయకు వినతిపత్రం అందించారు. రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే అశోక్‌ నివాసానికి చేరుకుని తమ సమస్యలు ఏకరువుపెట్టారు. అండగా నిలవాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.లక్ష్మీనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, వాణిశ్రీ, సిఐటియు నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, హెచ్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలంలో అయ్యప్పస్వామి ఆలయ కూడలి నుంచి ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే లేకపోవడంతో పిఎకు వినతిపత్రం ఇచ్చి వెళ్లాలని సిఐ ఆదాం చెప్పారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వెళ్లేది లేదని మూడు గంటల పాటు అక్కడే ఆందోళన చేపట్టారు. చివరకు ఎమ్మెల్యే రావడంతో ఆయనకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.సుజా, బి.అప్పమ్మ, ఎం.రాధిక తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి నివాసం వద్ద ఆందోళన అనంతరం ఆమెకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.శాంతామణి, రాణి, సిఐటియు నాయకులు సూరయ్య తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు శిరీష, డి.సరోజిని, పి.భాగ్యలక్ష్మి, సిఐటియు నాయకులు ఆర్‌.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, సిఐటియు నాయకులు హెచ్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️