అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం

సాధారణ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా

మెళియాపుట్టి : చెక్‌పోస్టును పరిశీలిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- పాతపట్నం, మెళియాపుట్టి

సాధారణ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశామని, సరిహద్దుల్లో అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. పాతపట్నం సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్‌ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. చేపట్టాల్సిన పనులపై ఆరా తీసి సూచనలు అందజేశారు. తహశీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీసి సంబంధిత రికార్డును పరిశీలించారు. అనంతరం మెళియాపుట్టి మండలం అంతర్‌ రాష్ట్ర సరిహద్దు, వసుంధర చెక్‌పోస్టును పరిశీలించారు. మెళియాపుట్టి జెడ్‌పి హెచ్‌ఎస్‌ స్కూల్‌, జలకలింగుపురం పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. మర్రిపాడు సచివాలయ పరిధిలోని జలకలింగుపురం పోలింగ్‌ స్టేషన్‌ పరిశీలించి పోలింగ్‌ బూత్‌ ముంధర వద్ద ఉన్న రహదారిని సరిచేయాలని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, ఇవిఎంలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల కోసం ఏర్పాట్లను ఆయా అధికారులంతా వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈయన వెంట సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎన్నికలు విధులకు సంబంధించిన అధికారులు ఉన్నారు.

 

➡️