అందరి చూపు ఆ గ్రామం వైపు

పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కనుగులవలస గ్రామం అన్ని రంగాల్లో ముందుండి అందరికీ

‘నాడు-నేడు’ కింద రూపుదిద్దుకుంటున్న పాఠశాల

ప్రజాశక్తి- ఆమదాలవలస

పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కనుగులవలస గ్రామం అన్ని రంగాల్లో ముందుండి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామ యువతతో అక్షరాలు దిద్దించిన మొదటి వ్యక్తి బెండి చిట్టెయ్య మాస్టారు. 20 ఏళ్లపాటు గ్రామ విద్యార్థు లకు పాఠాలను బోధించి ఉన్నత విద్యావంతులుగా, ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కింది. తరువాత తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఆయన కుమారులు బెండి కృష్ణారావు 20 ఏళ్లు, బెండి సూర్యనారాయణ పదేళ్లు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి విద్యావంతులుగా తీర్చిదిద్దారు. గ్రామ పాఠశాలలో 50 ఏళ్లపాటు ఆ కుటుంబం నిస్వార్థ సేవలను అందించింది. గ్రామంలో ఏ తలుపు తట్టినా ఇద్దరు నుంచి ముగ్గురు ఉద్యోగులు ఉంటారు. కొంతమంది వైద్య నిపుణులుగా మరికొందరు ఇంజినీర్లుగా, మరి కొంతమంది శాస్త్ర సాంకేతిక విద్య పరిశోధకులుగా తయారు చేశారు. అప్పట్లో గ్రామ పెద్ద ఇంటి వరండాలో నడిచే పాఠశాలకు సమితి వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించిన కీర్తిశేషులు బొడ్డేపల్లి రామ జోగినాయుడు పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చి 1900 లో పునాది వేశారు. పాఠశాలను నిర్మించి అక్షర కోవెలగా తీర్చిదిద్దారు. గ్రామానికి రహదారి లేకపోవడంతో రాత్రి, పగలు రైల్వేట్రాక్‌పై నడిచి గ్రామానికి చేరుకోవడానికి నానా ఇబ్బందులు ప్రజలు పడుతుండడాన్ని గమనించి ఆనాటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కీర్తిశేషులు నూక పాపారావు, అప్పటి సర్పంచ్‌ నూక చందర్రావు, బొడ్డేపల్లి ఆనందరావు, నారాయణరావు సొంత స్థలాలను ఇచ్చి ఆమదాలవలస నుంచి కనుగులవలస గ్రామానికి రహదారి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ కొలువుల్లో ఎందరో…అక్కడి పాఠశాలలో చదువుకున్న ఒకప్పటి విద్యార్థులు నేడు హెచ్‌ఎంలు, ఎంఇఒలుగా సేవలందిస్తున్నారు. విశాఖపట్నం కెజిహెచ్‌ సూపరింటిండెంట్‌ డాక్టర్‌ బెండి తేజేశ్వరరావు, కెజిహెచ్‌ న్యూరో సర్జరీ హెచ్‌ఒడి డాక్టర్‌ సీపాన గోపి, జిల్లాలో రిమ్స్‌లో సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ బొడ్డేపల్లి సూర్యారావు, స్త్రీ ప్రసూతి వైద్యులు డాక్టర్‌ సంపదరావు శ్రీదేవి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ సీపాన సోమశేఖర్‌, బయోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్త ఎన్‌.శ్రీరామ్మూర్తి, వైద్యో నారాయణో హరిగా కీర్తిగాంచిన వైద్యులు నూక భాస్కరరావు, నూక చంద్రశేఖరరావు, సామాజిక శాస్త్రవేత్త నూక సన్యాసిరావులు ఈ గ్రామానికి చెందిన వారే కావడం విశేషం. గ్రామంలో ఉపాధ్యాయులు 175 మంది, ఇంజనీర్లు 265 మంది, రైల్వే శాఖలో 180 మంది, వైద్యులు 120 మంది, బ్యాంకింగ్‌ రంగంలో 37 మంది, పోలీసులు 72 మంది, త్రివిధ దళాల్లో 56 మంది, ఇతర శాఖల్లో మరో 75 మంది విధులు నిర్వహిస్తున్నారు.ఉద్యమాలకు పురిటిగడ్డఎపిటిఎఫ్‌ రాష్ట్ర బాధ్యులుగా సేవలందించిన సువ్వారి అచ్చెంనాయుడు, బొడ్డేపల్లి అప్పయ్య, జోగారావు, యుటిఎఫ్‌ సంఘ ప్రతినిధులు బొడ్డేపల్లి జనార్థనరావు, మోహనరావు ఉద్యమాల్లో పాల్గొన్నారు. చౌదరి సంపూర్ణమ్మ, హనుమంతు రంగయ్యలు అప్పట్లో నక్సల్‌ బరి ఉద్యమంలో చేరి కొన్నాళ్లపాటు జైలు జీవితం గడిపి దళ నాయకులుగా అనేక పోరాటాల్లో పాల్గొని అజ్ఞాతంలో గడిపి జన స్రవంతిలోకి వచ్చారు. కమ్యూనిస్టు నాయకుడు చౌదరి తేజేశ్వరరావు అత్తగారి గ్రామం కనుగులవలసే. అప్పట్లో వంగపండు ప్రసాదరావు గ్రామాన్ని సందర్శించి రాత్రి కళాజాతను ఏర్పాటు చేసి తన పాటలతో యువతను ఉర్రూతలూగించి ఉద్యమాల వైపు నడిపించారని, పోలీసులు గ్రామంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేవారిని పెద్దలు గుర్తు చేస్తుంటారు. ఆ గ్రామ చరిత్ర నేడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. నేడు అందరి చూపు ఆ గ్రామం వైపే ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

➡️