అరాచకాలు తప్ప అభివృద్ధి ఏదీ?

రాష్ట్రంలో అరాచకాలు, అన్యాయాలు తప్ప అభివృద్ధి లేదని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

ఇచ్ఛాపురం : మాట్లాడుతున్న షర్మిల

బిజెపికి బానిసగా జగన్‌ ప్రభుత్వం

దుష్ట పాలనకు అంతం పలకాలి

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

రాష్ట్రంలో అరాచకాలు, అన్యాయాలు తప్ప అభివృద్ధి లేదని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఇచ్ఛాపురంలో ప్రజాప్రస్థానం విజయస్థూపం వద్ద నివాళ్లర్పించారు. అనంతరం స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు కీ.శే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచి పుట్టినవేనని తెలిపారు. వైఎస్‌ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే ఆయన బిడ్డగా తాను వచ్చానన్నారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇచ్ఛాపురం నుంచి తన ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. వైఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. వైఎస్‌ జీవించినంత కాలం బిజెపిని వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. బిజెపికి ఇక్కడి పార్టీలు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బిజెపికి కీలుబొమ్మగా జగన్‌ ప్రభుత్వం మారిందని ధ్వజమెత్తారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకొచ్చాక ఒక్కరోజూ హోదా ఊసెత్తలేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొస్తే రాహుల్‌ గాంధీ తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతానని చెప్పారని తెలిపారు. వైసిపి ప్రభుత్వంలో సాగుతున్న అరాచకాలు, అన్యాయాలతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. దుష్ట పాలనను అంతం చేయడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. వైఎస్‌ పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పట్నుంచే సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు, నాయకులు కె.వి.పి రామచంద్రరావు, రఘువీరారెడ్డి, జెడి శీలం, డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, ఈశ్వరి, ఆలీంఖాన్‌, మాస పత్రిచక్రవర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు వినతులుషర్మిల తొలిసారిగా ఇచ్ఛాపురం వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయుల సంఘాల నాయకులు సిపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించి ఆమె కంట పడ్డారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. అలాగే బెంతు ఒరియా కులస్తులు తమకి జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. విశ్రాంత డిఎస్‌పి సమళ్ల ప్రసాదరావు రైతాంగం ఎడురుకుంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వంశధార జలాలు ఇచ్ఛాపురం వరకు పొడిగిస్తే… రైతాంగానికి మెలుచేకూరుతుందని వివరించారు. సహారా ఇండియా బాధితులు తమకి న్యాయం చేయాలని విన్నవించారు. ఆర్‌టిసి బస్సులో ప్రయాణంకంచిలి : పిసిసి అధ్యక్షులు షర్మిల కంచిలి మండల పరిధిలో రెండు కిలోమీటర్ల మేర ఆర్‌టిసి బస్సులో ప్రయాణించారు. శ్రీకాకుళం నుంచి కారులో ఇచ్ఛాపురం కార్యక్రమానికి వెళ్తుండగా… అంపురం జాతీయ రహదారి వద్ద కారు ఆపి అటుగా వస్తున్న ఆర్‌టిసి బస్సులో ఎక్కి ఇచ్ఛాపురం వరకు ప్రయాణించారు. అమ్మఒడి, ఇళ్ల స్థలాలు వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో పాటు పలువురు మహిళలు ఆమెతో సెల్ఫీలు దిగారు.ఘన స్వాగతంపలాస, టెక్కలి : పలాస మొగిలిపాడు జాతీయ రహదారి వద్ద షర్మిలకు కాంగ్రెస్‌ నాయకులు టి.మధు, వీర్రాజు, చంటి, బబ్బులు, టెక్కలి శ్యాంసుందరాపురం కూడలి వద్ద జిల్లా కిసాన్‌ సెల్‌ ఆధ్యక్షులు కోత మధుసూదనరావు, పూర్వ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పొట్నూరు ఆనందరావు, చింతాడ దిలీప్‌, ఉమహంతి ధర్మారావు, కొటబొమ్మాళి, సంతబొమ్మాళి నాయకులు స్వాగతం పలికారు.

➡️