అర్ధాంతరంగా ఆగిన మడ్డువలస

Mar 5,2024 20:57

ప్రజాశక్తి -శ్రీకాకుళం ప్రతినిధి : మడ్డువలస రెండో దశ పనులు అర్ధాంతరంగా ఆగాయి. నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే ప్రధాన కారణమన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది. మరోవైపు కాలువ తవ్వకాలకు అధికారులు భూమిని సేకరించినా రైతులకు డబ్బులు ఇవ్వకపోవడమూ పనులు ఆగిపోవడానికి దారితీసింది. దీంతో పాటు పొందూరు మండలంలోని పలు ప్రాంతాల్లో బండరాళ్ల తొలగింపునకు మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో కాలువ తవ్వకాలు నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం ఈ పనులు ఈ ఏడాది జనవరి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అధికారులు పలుమార్లు నోటీసులు ఇస్తున్నా కాంట్రాక్టర్‌ స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒప్పందాన్ని రద్దు చేయాలని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సి ఉంది.
మడ్డువలస జలాశయ రెండో దశ పథకాన్ని చేపట్టాలని 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 6, 2009లో రూ.57.87 కోట్లకు పరిపాలనా ఆమోదం కూడా తెలిపింది. జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 24,954 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు మొత్తం 21 గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పథకం నిర్మాణ బాధ్యతలను విశాఖపట్నానికి చెందిన పిజెఆర్‌ కనస్ట్రక్షన్స్‌ సంస్థ టెండర్లలో రూ.47.39 కోట్లకు దక్కించుకుంది. మార్చి 2, 2009న ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం పనిని 24 నెలల కాలంలో పూర్తి చేయాలి. అంటే, మార్చి 2, 2011 నాటికే పనులు పూర్తయి రైతులకు సాగు నీరందించాలి. ఒప్పంద కాలపరిమితులు పొడిగిస్తూ ప్రభుత్వం వరుసగా ఆరు పర్యాయాలు అవకాశమిచ్చింది. చివరి సారిగా కాలపరిమితిని జూన్‌ 30, 2018 వరకు పొడిగించింది. అధికారిక లెక్కల ప్రకారం 78.36 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 21.64 శాతం పనులు మిగిలి ఉన్నాయి. ఒప్పందం విలువ రూ.47.393 కోట్లలో రూ.37.14 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం సంబంధిత నిర్మాణ సంస్థ పనులు నిలుపుదల చేసింది. దీంతో ప్రభుత్వం జూలై 8, 2020లో సంబంధిత నిర్మాణ సంస్థతో ఒప్పందాన్ని ముగించింది.
జనవరితో ముగిసిన గడువు
రిజర్వాయర్‌ పనులు చేపట్టిన పిజెఆర్‌ కనస్ట్రక్షన్స్‌ సంస్థ ఇప్పటివరకు 78.36 శాతం మేర పనులు పూర్తి చేసి వైదొలగింది. మిగిలిన 21.64 శాతం పనులు చేసేందుకు కొత్త నిర్మాణ సంస్థకు పనులు పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు మిగిలిన పనులకు కొత్త రేట్లకు అనుగుణంగా అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపి రూ.26.90 కోట్లు మంజూరు చేస్తూ 2022 ఏప్రిల్‌ 25న ఉత్తర్వులు జారీ చేసింది. స్టేజ్‌-2లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన బిఎన్‌బి ఇన్‌ఫ్రా ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీ రూ.23.83 కోట్లతో టెండర్లను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జనవరితో గడువు ముగిసింది.
పనులు జరిగింది ఐదు శాతమే
మడ్డువలస రెండో దశ పూర్తి కావాలంటే మిగిలిన 21.64శాతం పనులు పూర్తి చేయాలి. ఇప్పటివరకు ఇందులో ఐదు శాతమే పూర్తయినట్లు తెలిసింది. పొందూరు మండలం విఆర్‌ గూడెం, ధర్మపురం, వావిలపల్లిపేట ప్రాంతాల్లో కాలువ తవ్వకాలకు బండరాళ్లు అడ్డురావడంతో వాటిని పేల్చి తొలగించాల్సి ఉంది. గనులశాఖకు దరఖాస్తు చేసినా అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతుల నుంచి తీసుకున్న భూములకు రూ.2.25 కోట్లను చెల్లించకపోవడంతో కాలువ తవ్వకాలూ ఆగిపోయాయి.
ఒప్పందం రద్దుపై అధికారుల లేఖ
పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థకు సుమారు రూ.1.80 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్‌ పెద్దగా ఆసక్తిచూపడం లేదని సమాచారం. బిల్లులు వస్తాయో లేదోనన్న సందేహంతో వెనకడుగు వేస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదు. పది కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉండగా నాలుగు కిలోమీటర్ల మేర తవ్వారు. కాలువపై 250 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్కటీ నిర్మించలేదు. పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా కాంట్రాక్టర్‌ స్పందించడం లేదని తెలుస్తోంది. దీంతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సి ఉంది.

➡️