అహంకారం… అణచివేత

అంగన్వాడీ కార్యకర్తలు పట్టువదలకుండా తమ సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మె ప్రారంభించి 12 రోజులు గడుస్తున్నా తగ్గేదేలే అంటూ ధర్నాలు, రాస్తారోకోలు, జలదీక్షలు, వంటి రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంపు, సుప్రీం కోర్టు ప్రకారం గ్రాట్యూటీ అమలు, కనీస వేతనం రూ.26 వేలు తదితర డిమాండ్లపై అంగన్వాడీలు ఇప్పటికే పలు పద్ధతుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

అంగన్వాడీ కార్యకర్తలు పట్టువదలకుండా తమ సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మె ప్రారంభించి 12 రోజులు గడుస్తున్నా తగ్గేదేలే అంటూ ధర్నాలు, రాస్తారోకోలు, జలదీక్షలు, వంటి రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంపు, సుప్రీం కోర్టు ప్రకారం గ్రాట్యూటీ అమలు, కనీస వేతనం రూ.26 వేలు తదితర డిమాండ్లపై అంగన్వాడీలు ఇప్పటికే పలు పద్ధతుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చలో కమిషనరేట్‌, చలో కలెక్టరేట్‌, చలో ఆర్‌డిఒ కార్యాలయం వంటి కార్యక్రమాలతో ఆందోళనలు కొనసాగిస్తున్నా దున్నపోతు మీద వాన కురిసినటు ప్రభుత్వం కనీసం చలించలేదు. వాటి పర్యావసానమే నేటి అంగన్వాడీల సమ్మె. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు పెంచుతాం, అంగన్వాడీలను ఆదుకుంటామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా వారికి వాగ్ధానం చేశారు. నాలుగున్నరేళ్లు గడచినా నేటికీ ఆ హామిని అమలు చేసేందుకు ప్రభుత్వానికి మనస్కరించడం లేదు. తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తకు రూ.13,500, హెల్పర్‌కు రూ.7,800 వేలు ఇస్తుంటే… ఇక్కడ మాత్రం కార్యకర్తకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7 వేలే ఇస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా సమ్మెచేస్తున్న వారిపై ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతోంది. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు అన్నిరకాల పద్ధతులను అనుసరిస్తోంది. అంగన్వాడీలు లేకుండానే కేంద్రాలను తెరిపించి సమ్మె ప్రభావం ఏమీ లేదని చెప్పేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి అన్ని కేంద్రాలు తెరిచేలా చూడాలంటూ ఆదేశించింది. సచివాలయ మహిళా పోలీసులు, వాలంటీర్లు, సిఎఫ్‌లకు బాధ్యతలను అప్పగిస్తోంది. అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టించి పని కానిస్తోంది. కొన్నిచోట్ల సర్పంచ్‌లకు బాధ్యతలను అప్పగించింది. అవకాశం ఎప్పుడు దొరుకుతుండా అని ఎదురుచూస్తున్న వైసిపి సానుభూతి సర్పంచ్‌లు వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. సెంటర్‌కు రాకపోతే ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా రకరకాల పద్ధతుల్లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారి సమ్మెపై ఉక్కుపాదం మోపుతోంది.అంగన్వాడీలకు తాము దయతలచి జీతాలు పెంచాలే తప్ప తమను ఎదిరించడమేమిటన్న వైఖరి ప్రభుత్వంలో కనపడుతోంది. బతకలేక వేతనాలు పెంచాలని అడుగుతుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ వేతనాలు పెంచలేమని చెప్తున్న ప్రభుత్వం అదే సమయంలో వాలంటీర్లకు వచ్చేనెల నుంచి రూ.750 వేతనం పెంచడం అంగన్వాడీలపై కక్షపూరిత ధోరణికి అద్దం పడుతోంది. సమ్మెకు దిగినందుకు మీకేమి ఇవ్వం, నోరు విప్పకుండా మౌనంగా ఉంటే కాస్తాయినా దయ తలుస్తామంటూ ఉత్తర్వులు ద్వారా సంకేతాలు ఇచ్చింది. ప్రతి కుటుంబానికీ వివిధ సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.1.40 లక్షలను లబ్ధిదారుల ఖాతాలకే ఇచ్చామని చెప్తున్న ప్రభుత్వం అంగన్వాడీలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. వారి వేతనం రూ.10 వేలు దాటడంతో వారిని అన్నిరకాల సంక్షేమ పథకాలకు దూరం చేసింది. కేవలం వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.11,500లతోనే బతుకీడుస్తున్నారు. అంటే సంవత్సర మంతా పనిచేస్తే అంగన్వాడీ కుటుంబానికి రూ.1.38 లక్షల ఆదాయమే దక్కుతోంది. ప్రభుత్వ సేవలు అందిస్తున్న తమకు రూ.1.38 లక్షలు, వేరే పనిచేసుకుంటూ బతుకుతున్న లబ్ధిదారు కుటుంబానికీ రూ.1.40 లక్షలు ఇవ్వడాన్ని అంగన్వాడీలు పోల్చుకోవడాన్ని తప్పు పట్టాల్సింది లేదు. ఎన్నికల ముందు ఉద్యోగులు, కార్మికులు సమ్మె నోటీసులు ఇస్తే వాటిని పరిష్కరించి, సమ్మెను నివారించే ప్రయత్నాలు చేయాల్సిన సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇలా అహంకారపూరితంగా వ్యవహరించడం ద్వారా తన రాజకీయ అపరిపక్వతను బయటపెట్టుకున్నారు. ఇదే సమయంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులూ నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. మరోవైపు మున్సిపల్‌ కార్మికులూ సమ్మెకు సమయాత్తమవుతున్నారు. ఉద్యోగులు, కార్మికులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోవు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంగన్వాడీల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతున్న వైనాన్ని గమనించిన టిడిపి వారికి సంఘీభావం ప్రకటించడం మొదలు పెట్టింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక సెక్షన్‌ ఉద్యోగులకు దగ్గరయ్యేందుకు తపన పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక మంటలో తానూ కొంత చలి కాచుకోవాలని భావిస్తోంది. అంగన్వాడీల దీక్షా శిబిరాలకు నాయకులు హాజరై మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇదేఅదనుగా ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నారు. దీక్షా శిబిరాలకు హాజరు కావడానికే పరిమితమవుతున్న నాయకులు క్షేత్ర స్థాయిలో దిగడం లేదు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగుల గొడుతున్నా, ఉద్యోగులను అడ్డుకునే ప్రయత్నాలు చేసుంటే చాలాచోట్ల కేంద్రాలు తెరుకునేవి కావు. ఉమ్మడి రాష్ట్రంలో 2001లో చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వం అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘటన బహుశా టిడిపి నాయకులను ఇంకా వెంటాడుతుందో ఏమో. అంగన్వాడీల ఆందోళనలో వారు పెద్దగా భాగస్వామ్యం కావడం లేదు. అంగన్వాడీల పోరాటానికి వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం, కార్మిక సంఘాలైన సిఐటియు, ఇతర ప్రజాసంఘాలు తొలి నుంచీ అండగా నిలుస్తూ వారి వెన్నంటే ఉన్నాయి. ఈ నెల 26 నుంచి ప్రత్యక్ష పోరాటానికి సైతం సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో పోరాడి గతంలో ఎన్నో విజయాలు సాధించిన అంగన్వాడీలు అదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరముంది.

➡️