ఇఎస్‌ఐ లోకల్‌ పే ఆఫీసు ఏర్పాటు చేయాలి

మండలంలోని పైడిభీమవరంలో ఇఎస్‌ఐ లోకల్‌ పే కార్యాలయం ఏర్పాటు

వినతిపత్రం అందిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- రణస్థలం

మండలంలోని పైడిభీమవరంలో ఇఎస్‌ఐ లోకల్‌ పే కార్యాలయం ఏర్పాటు చేయాలని, డిస్పెన్సరీలో రిఫరల్‌ సౌకర్యం కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్‌.వి.రమణ డిమాండ్‌ చేశారు. పైడిభీమవరం ఇఎస్‌ఐ డయాగస్టిక్‌ సెంటర్‌ ప్రారంభానికి ఆదివారం విచ్చేసిన ఇఎస్‌ఐ ఎపి రీజినల్‌ డైరెక్టర్‌ ఎ.వేణుగోపాలరావు, డిప్యూటీ డైరెక్టర్‌ జోస్‌ మార్టిన్‌లను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఇఎస్‌ఐ టై ఆఫ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీలు ప్రారంభించి డాక్టర్లను, సిబ్బందిని నియమించి కార్మికులకు వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలో వంద పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే సకాలంలో సరైన వైద్యం అందక కార్మికులు మృతి చెందుతున్నారని, దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇఎస్‌ఐ రిఫరల్‌ రాయించుకోవడానికి విశాఖపట్నంలోని మల్కాపురం వెళ్లాల్సి వస్తుందన్నారు. పలాస నుంచి యితే 200, శ్రీకాకుళం నుంచి అయితే 120 కిలోమీటర్లు దూరం వ్యయ ప్రయాసలతో రోగులు వేళ్లలేకపోతున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా డిస్పెన్సరీ, ప్యానెల్‌ క్లినిక్‌లో రిఫరల్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. పైడిభీమవరం ఇఎస్‌ఐ డిస్పెన్సరీ పరిధిలో సుమారు 18 వేల మంది కార్మికులు ఉన్నారని వివరించారు. లోకల్‌ పే ఆఫీసు లేకపోవడంతో సెలవు కోసం శ్రీకాకుళం, విజయనగరం వెళ్లాల్సి వస్తోందన్నారు. అలాగే డిస్పెన్సరీల్లో అన్నిరకాల మందులు సరఫరా చేయాలనిన్నారు. కార్యక్రమంలో ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️