ఇచ్చిన హామీ అమలు చేయాలి

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ

ఆమదాలవలస : దీపాలు వెలిగించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

  • 42వ రోజుకు అంగన్వాడీల నిరవధిక సమ్మె

ప్రజాశక్తి – ఆమదాలవలస, టెక్కలి రూరల్‌

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 42 రోజులకు చేరింది. సమ్మెలో భాగంగా ఆమదాలవలసలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మనసు మార్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీపాలు వెలిగించారు. టెక్కలిలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీలను ఉద్దేశించి సిఐటియు నాయకులు ఎన్‌.షణ్ముఖరావు మాట్లాడారు. తన చెల్లెలు వ్యతిరేకిస్తుండడంతో రాష్ట్రంలోని అందరు అంగన్వాడీ అక్కాచెల్లెళ్లపై జగన్‌ కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాలుగేళ్లుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మొదలవలస లత, మాధవి, పి.లక్ష్మి, రమ, ఉష తదితరులు పాల్గొన్నారు.

 

➡️