ఇన్నాళ్లకు గుర్తొచ్చారు

టెక్కలి నియోజకవర్గంలో మూలపేట

నందిగాం మండలం కవిటి అగ్రహారంలో వృద్ధురాలిని హత్తుకొని పలకరిస్తున్న అచ్చెన్నాయుడు (ఫైల్‌)

  • ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లోకి అచ్చెన్నాయుడు
  • నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ సమస్యలు పట్టని వైనం
  • పోర్టు కోసం పంటలను తొక్కిస్తే ఎక్కడున్నారంటూ జనంలో చర్చ

పండగ వేళ హరిదాసులు, డుడూ బసవన్నలు వచ్చినట్లు ఎన్నికల సమీపిస్తుండడంతో కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల బాట పడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోని నేతలు తీరిగ్గా ఇప్పుడు జనం సమస్యలను తెలుసుకుంటున్నారు. క్యాంపు కార్యాలయాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అమరావతి, విశాఖ వంటి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ కాలం గడిపిన నేతలు ప్రజలు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓట్ల కోసం ఎన్నికల ముందు వస్తారు, ఆ తర్వాత పట్టించుకోరన్న నానుడిని నిజం చేస్తూ టెక్కలి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గ్రామాలను చుట్టుముడుతున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టును నిర్మించే క్రమంలో ప్రభుత్వం అనేక అడ్డదారులు తొక్కింది. సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. రైతులు వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూములను తీసుకుంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం ఇళ్లు, పశువుల శాలలు తదితర స్ట్రక్చర్ల విలువ కోసం పోలీసు బలగాలను పెట్టి బలవంతంగా చేయించారు. పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై బైండోవర్‌ కేసులు సైతం నమోదు చేశారు. పోర్టుకు భూములు ఇవ్వని వారి పంటలను బుల్డోజర్లతో తొక్కించారు. నిర్వాసితులకు జరగుతున్న అన్యాయంపై సిపిఎం పలు పోరాటాలు సాగించింది. అయినా ప్రభుత్వం మొండివైఖరితో ముందుకు సాగింది. ధ్వంసమైన పంట పొలాలను పరిశీలించేందుకు వెళ్లిన సిపిఎం నాయకులకు అరెస్టులు చేయించింది. ఇంత జరిగినా టెక్కలి ఎమ్మెల్యే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏనాడూ అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ చర్యలపై ఆ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ప్రశ్నించడం, అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఉంటే నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు కొంతవరకైనా నెరవేరేవన్న చర్చ అప్పుట్లో సాగింది.మృత్యువాత పడినా దిక్కు లేని పరిస్థితిటెక్కలి పాతబస్టాండ్‌ సమీపంలో గతేడాది అక్టోబర్‌ 16న పోర్టు వాహనం ఢకొీని శ్రీరామ కాలనీకి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. టెక్కలి మండలం నారాయణపురం వద్ద గతేడాది డిసెంబర్‌ 22న పోర్టు వాహనాన్ని వెనుక నుంచి ఢకొీని సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన శేషు అనే యువకుడు మృతి చెందాడు. కాంట్రాక్టు పనులు పర్యవేక్షిస్తున్న వైసిపి టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ రూ.మూడు లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినా బాధిత కుటుంబం తిరస్కరించింది. గతేడాది ఆగస్టు 14న సంతబొమ్మాళి మండలం హనుంతనాయుడుపేట పంచాయతీ సీతారాంపురానికి చెందిన లక్ష్మీనారయణ పోర్టు నిర్మాణ పనులు చేసేందుకు వెళ్తున్న క్రమంలో పోర్టుకు చెందిన టిప్పరు ఢకొీనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వీరంతా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన బాధితులే. వీరికి పరిహారం చెల్లించాలనే డిమాండ్‌నూ ప్రభుత్వం ముందుంచలేదు. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించనూ లేదు.కరువుతో అల్లాడుతున్నా కదల్లేదునియోజకవర్గంలో మూడేళ్లుగా సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టెక్కలి, నందిగాం మండలాల్లో శివారు ప్రాంతాలకు వంశధార నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయాయి. గతేడాది ఖరీఫ్‌లో నందిగాంలో 3,800 ఎకరాలు, సంతబొమ్మాళి మండలంలో 968 ఎకరాలు ఎండిపోయాయి. ఈ సంవత్సరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేలాది ఎకరాల్లో రైతులు పంటలు వేయలేకపోయారు. కొన్నిచోట్ల వేసిన పంటలూ ఎండిపోయాయి. పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశాలతో కోటబొమ్మాళి మండలంలోని పలు ఎత్తిపోతల పథకాలకు నీరు ఆపేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలోనూ పెద్దగా స్పందించలేదు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు సైతం ఎమ్మెల్యేకు తీరిక లేకపోయింది.తీరిగ్గా పలకరింపులు.. పరామర్శలుటిడిపి అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి చాలా తక్కువ సమయం కేటాయించారు. ఆయన క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు రావడమే తప్ప జనంలోకి వెళ్లిన సందర్భాలు వేళ్లపై లెక్క పెట్టొచ్చు. టిడిపికి రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తుండడంతో అమరావతి, ఇతర జిల్లాల్లో పర్యటనలకు ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖలోని తన నివాసంలో ఎక్కువ రోజులు గడిపేవారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు, వారి సమస్యలను వినేందుకు మాత్రం పెద్దగా సమయం కేటాయించలేదన్న చర్చ ఆ పార్టీ నాయకుల్లో సైతం సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం పలకరింపులు, పరామర్శలతో ఇప్పుడు గ్రామాల్లో కలియతిరుగుతున్నారు.

 

 

➡️