ఊరంతా సంక్రాంతి

తెలుగు వారు ఘనంగా చేసుకునే ముఖ్యమైన పండుగల్లో

కిటకిటలాడుతున్న పొట్టిశ్రీరాములు మార్కెట్‌

  • పట్టణాలు, గ్రామాల్లో పండగ హడావుడి
  • సందడి చేస్తున్న కళాకారులు పల్లెబాట
  • పట్టిన పట్టణవాసులుకళకళలాడుతున్న మార్కెట్లు
  • రద్దీగా మారిన రోడ్లుప్రయాణాలకు తప్పని తిప్పలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

తెలుగు వారు ఘనంగా చేసుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతి రానే వచ్చింది. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా పెద్ద పండుగను అన్ని తరగతుల ప్రజలు కుటుంబాలతో కలిసి చేసుకోవడంతో పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. దూర ప్రాంతాల్లో నివసించే వారు స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో పండగ సందడి పతాకస్థాయికి చేరింది.సంక్రాంతి పండగకు ఎక్కడెక్కడో ఉన్న వారు స్వగ్రామాలకు చేరుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సంక్రాంతికి శోభను తీసుకొచ్చే హరిదాసులు, గంగిరెద్దులు, చెంచులు, బుడగజంగాలు, డప్పు వాయిద్య కళాకారులు హడావుడి చేస్తున్నారు. జానపద కళాకారుల ఆటపాటలు సంక్రాంతికి మరింత వన్నె తెచ్చి పెట్టింది. నిరుపేదలకు పలువురు దాతలు వ్యక్తిగతంగానే కాకుండా సంస్థలు, సంక్షేమ సంఘాల తరపున వస్త్ర దానాలు వంటి కార్యక్రమాలను కూడా పండగ సందర్భంగా నిర్వహిస్తున్నారు.వస్త్ర దుకాణాలు పండగ కళను సంతరించుకున్నాయి. కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని జి.టి రోడ్డు, పాలకొండ రోడ్డు, కళింగ రోడ్డులో జన సందడి నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ వస్తాల్ర కొనుగోలుకు క్యూ కడుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా వస్త్ర వ్యాపారులు రకరకాల డిజైన్లను అందుబాటులోకి తెచ్చారు. వస్త్ర వ్యాపారులు అక్టోబరు నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కొనుగోలు చేసేందుకు వెళ్లడం ప్రారంభిస్తారు. నవంబరు నెలాఖరు నాటికి పలురకాల వస్తాల్రను తెప్పిస్తారు. శ్రీకాకుళం నగరంలో చిన్నాపెద్దా అన్నీ కలిపి 200కు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆన్‌లైన్‌ వస్త్ర వ్యాపారం కూడా విస్తృతంగా నడుస్తోంది. జిల్లా నలుమూల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది క్రిస్మస్‌ నుంచి ఈ వ్యాపారం ఊపందుకుంది. సంక్రాంతి వరకూ వస్త్ర దుకాణాలన్నీ బిజీగా ఉంటాయి.టిక్కెట్ల కోసం థియేటర్ల వద్ద పడిగాపులుఇదే సందర్భంలో వరుసగా కొత్త సినిమాలు విడుదల కావడంతో వాటికి డిమాండ్‌ నెలకొంది. టిక్కెట్ల కోసం థియేటర్ల చుట్టూ జనం ప్రదక్షిణలు చేస్తున్నారు. పండగ రోజుల్లో ఇంటిల్లిపాదీ సినిమాలు తిలకించేందుకు టిక్కెట్లను అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుని వాటిని తిలకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.ఉపాధి కోసం వలసలు వెళ్ళిన వారంతా సంక్రాంతి నేపథ్యంలో తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు స్వస్థలాలకు చేరుకోగా, మరికొందరు పండగ నేపథ్యంలో వస్తూనే ఉన్నారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయి అక్కడ పనులు చేసుకుంటున్నారు. అలా వెళ్ళిన వారంతా కుటుంబాలతో కలిసి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. పండగ నేపథ్యంలో బస్సులు, రైళ్లు అన్నీ రద్దీగా మారిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో సొంత వాహనాలపైనే ఎక్కువగా ప్రయాణాలను సాగించేందుకే ఎక్కువగా ప్రజలు మొగ్గుచూపుతున్నారు.

➡️