ఎన్నికల వేళ వాలంటీర్లపై కోడ్‌

ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాలంటీరు వ్యవస్థపై నిఘా మొదలైంది. ఎన్నికల్లో అన్నీ తామై వ్యవహరించాలని, బూత్‌ ఏజెంట్లుగా వైసిపికి పనిచేయాలని స్వయానా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గతంలో వాలంటీర్లకు బోధించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, మంత్రులు అదే పల్లవిని అందుకుని వాలంటీరు వ్యవస్థను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రత్యర్థులు ఈ ప్రచారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవస్థపై సంఘం దృష్టి సారించింది. కోడ్‌ ఉల్లంఘన పేరుతో ఇప్పటికే కొందరిని తొలగించారు. తాజాగా ఈ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లను సాధారణ విధులకు వాడితే ఓటర్లను ప్రభావితం చేయగలరని ప్రత్యర్థులు మరోమారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వారి వద్ద నున్న టాబ్‌, సెల్‌ఫోన్‌, సిమ్‌ కార్డులను సంబంధితశాఖ కార్యాలయాల్లో జమ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలను అనుసరించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో వాలంటీర్ల నుంచి వాటిని సేకరించే చర్యలు మొదలు పెట్టారు. మరోవైపు ఎన్నికల వేళ ఏప్రిల్‌, మే నెల పింఛన్లు లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. సెర్ఫ్‌ అధికారులు పింఛన్ల పంపిణీ బాధ్యతలను క్షేత్రస్థాయిలో వాలంటీర్లకు అప్పగించాల్సి ఉంటుంది. రెండు రోజుల ముందే మొదలు కావాల్సి ఉంటుంది. ఈ నెల 30లోగా తాజా పింఛనుదారుల జాబితాతో పాటు నిధులు అందజేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు ఆదరైజేషన్‌ థంబ్‌ వేసిన అనంతరం లబ్ధిదారులకు పింఛను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని భావించిన సెర్ప్‌ అధికారులు ఈ రెండు నెలల పాటు పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల ఆదరైజేషన్‌ పత్రాలను తీసుకోవాలని ఎంపిడిఒలకు, మున్సిపల్‌ కమిషనర్లకు, పంచాయతీ కార్యదర్శులకు, సంక్షేమ కార్యదర్శుల ఆదరైజేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పింఛన్ల పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా ఆదరైజేషన్‌ పత్రాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. పంపిణీ సమయంలో ఫొటోలు, వీడియోలు వాలంటీర్లు తీయ కూడదని, నిబంధనను ఉల్లంఘించినట్టయితే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ సెర్ప్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లలో ఎక్కువ శాతం మంది యువతే కావడంతో కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదైతే వారి భవిష్యత్‌కు అవరోధం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

➡️