ఒడిదుడుకుల్లో వ్యవసాయం

జిల్లాలో ఈ ఏడాది ఒడిదుడుకుల మధ్యే వ్యవసాయం

బూర్జలో బోరుతో నీటిని వదులుతున్న రైతు (ఫైల్‌)

  • వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో తగ్గిన సాగు
  • అన్నదాతలకు తప్పని సాగునీటి కష్టాలు
  • రబీని వీడని వర్షాభావ పరిస్థితులు
  • ధాన్యం అమ్ముకునేందుకు రైతుల అవస్థలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో ఈ ఏడాది ఒడిదుడుకుల మధ్యే వ్యవసాయం సాగింది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వెంటాడిన వర్షాభావ పరిస్థితులు చివరివరకూ సాగాయి. వేలాది ఎకరాల్లో రైతులు పంటలు వేయలేకపోగా వేసినవీ ఎండిపోయాయి. జులై, ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వేలాది ఎకరాల్లో రైతులు విత్తనాలు వేయలేకపోయారు. ఈసారి తుపాన్లు, అధిక వర్షాల ప్రభావం పెద్దగా లేకపోవడంతో రైతులకు కొంత ఊరటనిచ్చింది. ఒకట్రెండు అల్పపీడనాలు భయపెట్టినా, పంటపై పెద్దగా ప్రభావం చూపలేదు. ధాన్యం దిగుబడి అనుకున్నంత స్థాయిలో వచ్చినా కొనుగోళ్లు కోసం రైతులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.జిల్లాలో ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో లక్ష్యం మేర పంటలు సాగు కాలేదు. అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 3,81,833 ఎకరాల్లో పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా 3,39,588 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న పంటను ఈ ఏడాది 26,375 ఎకరాల విస్తీర్ణం వేయాలని అనుకోగా 23,633 ఎకరాల్లో వేశారు. పత్తి పంటను 4,620 ఎకరాల్లో వేయాలనుకోగా 2,763 మేర వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా 1470 ఎకరాల మేర వేశారు. పెసలు, రాగులు, గోగు పంటల సాగు 20 శాతం లోపే ఉంది. జిల్లాలో మొత్తమ్మీద 70 వేల ఎకరాల్లో పంటలు వేయలేదు.20 వేల ఎకరాల్లో ఎండిన వరివర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో 15 మండలాల పరిధిలో 20,813 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, కవిటి మండలాల్లో వరి పంట బాగా దెబ్బతింది. వీటితో పాటు పలాస నియోజకవర్గంలోని మూడు మండలాలు, మెళియాపుట్టి, సంతబొమ్మాళి, నందిగాం, పోలాకి, గార, ఎచ్చెర్ల, జి.సిగడాం, సారవకోట మండలాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 వేల ఎకరాల్లో పంటలు సాగు కాలేదని వ్యవసాయశాఖ నివేదికలు చెప్తున్నాయి. అందులో వరి పంటే 59 వేల ఎకరాలకు పైగా ఉంది. పంటలు సాగైనట్లు లెక్కలు చెప్తున్నా కొన్నిచోట్ల ఎండిపోతున్నాయి.సాగునీరందక రైతుల పాట్లువర్షాధారంపై ఆధారపడిన మెట్ట ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులే సాగునీటి కాలువ కింద ఉన్న ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఒడిశాలో కాస్తాకూస్తో వర్షాలు పడుతుండడంతో హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద తగినంత నీటి నిల్వలు ఉండనే ఉన్నాయి. కాలువల్లోకి నీటిని విడిచిపెడుతున్నా, అవి శివారు భూములకు చేరలేదు. కాలువల్లో పెద్దఎత్తున పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వర్షాల్లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. ఇంజిన్లు పెట్టుకుని పొలాలను తడుపుకున్నారు. కొన్నిచోట్ల ఆ అవకాశమూ లేకుండా పోయింది. వర్షాభావ పరిస్థితులతో పలు మండలాల్లో భూగర్బ జలాలు అడుగంటిపోవడంతో, చెరువులు ఎండిపోయిన పరిస్థితులను ఈ ఏడాది రైతులు చవిచూశారు.మారని కౌలు రైతుల దుస్థితికౌలు రైతుల దుస్థితి ఈ ఏడాది మారలేదు. భూ యజమానులు అంగీకార పత్రం ఇవ్వకపోవడంతో వేలాది మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేదు. భూ యజమానులు చివరకు ఆధార్‌ కార్డు ఇచ్చేందుకూ నిరాకరించారు. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉండగా 7,346 మందికి కార్డులను అందజేశారు. కార్డులు పొందినా రైతుభరోసా ప్రయోజనాలకు నోచుకోలేదు. కౌలు గుర్తింపు కార్డు లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు కూడా దక్కలేదు. దీంతో వారు ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి వ్యవసాయం నెట్టుకొచ్చారు.వరికి నామమాత్రంగా మద్దతు ధర పెంపుఈ ఏడాది వ్యవసాయ ఖర్చులు వేలల్లో పెరగ్గా, కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంది. గతేడాది సాధారణ రకం రూ.2040 ఉండగా ప్రస్తుతం రూ.2183కు పెంచింది. అదేవిధంగా ‘ఎ’ గ్రేడ్‌ రకం ధాన్యానికి గత ఖరీఫ్‌లో రూ.2060 చెల్లించగా, ప్రస్తుతం రూ.2,203 చెల్లిస్తున్నారు.8 లక్షలకు పైగా ధాన్యం దిగుబడిఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ జరిగింది. 3,34,330 ఎకరాలకు ఇకెవైసి పూర్తయింది. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా 390 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలును ప్రారంభించింది. ధాన్యం కొనుగోళ్లలో పాత కథే పునరావృతమవుతోంది. సాంకేతిక సమస్యలు, సిబ్బంది, జిపిఎస్‌ పరికరాల కొరతతో కొనుగోలులో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు ప్రక్రియ క్లిష్టతరం కావడంతో కొన్నిచోట్ల రైతులు దళారులకు తక్కువ ధరే ఇచ్చుకుంటున్నారు.రబీలోనూ వర్షాభావ పరిస్థితులేరబీలోనూ వర్షాభావ పరిస్థితులే తలెత్తాయి. డిసెంబరులో వర్షాలు పెద్దగా లేకపోవడంతో, అపరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. నేలలో తేమ శాతం తక్కువగా ఉండడంతో మినుము, పెసర పంటలను వేయలేకపోయారు. రబీలో పెసర సాధారణ సాగు 46,645 ఎకరాలు ఉండగా, ఇప్పటివరకు 765 ఎకరాల్లో సాగైంది. మినుము సాధారణంగా 70,340 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా 1152.5 ఎకరాల్లో వేశారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా వంశధార, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం జీరో లెవల్స్‌కు పడిపోయాయి. ఒడిశాల్లోనూ వర్షాలు లేకపోవడంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ చివరిలో పంటలు ఎండిపోతుండడంతో తోటపల్లి, మడ్డువలస నుంచి నీటిని విడిచిపెట్టి పంటలను కాపాడారు. గొట్టాబ్యారేజీ, మడ్డువలస రిజర్వాయర్ల నీటి నిల్వలు బాగా పడిపోయాయి.

 

➡️