ఓటింగ్‌ యంత్రాలపై అవగాహన అవసరం

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై

బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, తదితరులు

  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఆయా రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 33వ వారపు సమావేశంలో భాగంగా ఇవిఎంలు, వివి ప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్లపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ముద్రించిన ప్రత్యేక హ్యాండ్‌ బుక్‌ను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. పోలింగ్‌ నిర్వహణ మొదలు సాంకేతిక అంశాలు, ఆయా పరికరాల పూర్తి వివరాలు హ్యాండ్‌ బుక్‌లో ఉంటాయని తెలిపారు. వీటిలోని ప్రతి అంశాన్నీ తెలుసుకొని ఉండాలని కోరారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇసిఐ నిబంధనల మేరకు వీటిని ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఇవిఎంల సహాయంతో ఓటింగ్‌ ప్రక్రియ, వివి ప్యాట్‌లపై జిల్లావ్యాప్తంగా సంచార ప్రదర్శన వ్యాన్లతో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డెమో ఇవిఎంల ద్వారా స్వయంగా ఓటు వేసి తమ అనుమానాలను ఓటర్లు నివృత్తి చేసుకుంటారని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, కాంగ్రెస్‌ నాయకులు డి.మల్లిబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, బిజెపి నాయకులు సురేష్‌బాబు సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️