కదంతొక్కిన అంగన్‌వాడీలు

అంగన్‌వాడీలు మునుపెన్నడూ

కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన అంగన్వాడీలు

  • కలెక్టరేట్‌ వద్ద బైఠాయింపు
  • భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, హెల్పర్లు
  • ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల మద్దతు
  • సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించం
  • అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

అంగన్‌వాడీలు మునుపెన్నడూ లేని రీతిలో ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌ వద్ద బుధవారం చేపట్టిన బైఠాయింపు నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు ఉదయం తొమ్మిది గంటలకే కార్యకర్తలు, సహాయకులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్‌ ముందు బైఠాయించి తమ నిరసనను తెలిపారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు, సెంటర్లను వెంటనే తెరవాలని అధికారుల బెదిరింపులు మానుకోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంగన్‌వాడీల బైఠాయింపుతో కలెక్టరేట్‌ రహదారి మూసుకుపోయింది. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపారు. తమ వెంట తెచ్చుకున్న క్యారియర్లతో అంగన్‌వాడీలు రోడ్డుపైనే భోజనం చేసి ఆందోళన కొనసాగించారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది.కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె.కళ్యాణి, డి.సుదర్శనం మాట్లాడుతూ అంగన్‌వాడీల విషయంలో ప్రభుత్వం తన మొండివైఖరి వీడాలన్నారు. అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం 23 రోజులుగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అంగన్వాడీలకు మంత్రులు, అధికారులు సెంటర్లు తెరవాలని లేకుంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని… ప్రభుత్వ బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా సెంటర్ల తాళాలు బద్దలు కొట్టడం, నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం, నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. ఇటువంటి పద్ధతులు మానుకోవాలని హితవు పలికారు. సమస్యలను పరిష్కరించి, సమ్మెను ఆపాల్సిన ప్రభుత్వం అదిరింపులు, బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో 41 రోజులు, కర్నాటకలో 65 రోజులు సమ్మె చేసి అంగన్‌వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను సాధించుకున్నారని చెప్పారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు, ఇతర డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు : సిఐటియుఅంగన్వాడీలపై ప్రభుత్వం, అధికారుల బెదిరింపులు ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ అక్కాచెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రోడ్డున పడేయడం సిగ్గుచేటు అన్నారు. అంగన్వాడీలను చర్చలకు పిలిచి ప్రధాన డిమాండ్‌ అయిన వేతనాలు పెంచలేమని చెప్పడం సరికాదన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కంటే కనీసం రూ.వెయ్యి అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి వేతనం మాత్రమే పెంచిందని, నాలుగేళ్లుగా అంగన్వాడీల వేతనాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పునిచ్చినా, రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయడం లేదని విమర్శించారు. అంగన్వాడీలు గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు అనేక సేవలు అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని విమర్శించారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండివైఖరి వీడకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.పోరాటాన్ని ఉధృతం చేస్తాం : సిపిఎంఅంగన్‌వాడీల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని, వాటిని వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు హెచ్చరించారు. బైఠాయింపు కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీలకు కనీస వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వారిని మోసం చేశారని విమర్శించారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అంగన్‌వాడీలకు పలు సంఘాల సంఘీభావంఅంగన్‌వాడీలు చేపట్టిన బైఠాయింపు కార్యక్రమానికి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. సిఐటియు సీనియర్‌ నాయకులు భవిరి కృష్ణమూర్తి, కె.శ్రీనివాసు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, ఎస్‌.కిషోర్‌, పి.అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.ప్రసాద్‌, జి.సింహాచలం, జన విజ్ఞాన వేదిక నాయకులు గొంటి గిరిధర్‌, ఐద్వా కార్యదర్శి పి.శ్రీదేవి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అల్లు.మహాలక్ష్మి, ఎన్‌.వి రమణ, ఎస్‌.లక్ష్మీనారాయణ, ఎ.సత్యనారాయణ, ఎన్‌.గణపతి, హెచ్‌.ఈశ్వరరావు, కె.సూరయ్య, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.హైమావతి, పి.లతాదేవి, జె.కాంచన, కె.సుజాత, ఆదిలక్ష్మి, శాంతామణి, మాధురి తదితరులు పాల్గొన్నారు.

 

➡️