క్షయ నివారణకు కృషి

జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు అందరూ సహకరించాలని

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

డిఎంహెచ్‌ఒ మీనాక్షి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు అందరూ సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంపై జిల్లా టిబి కంట్రోల్‌ అధికారి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఎం.ప్రసాదరావుతో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవమని, ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని పట్టిపీడిస్తున్న భయంకరమైన వ్యాధులలో క్షయ వ్యాధి ఒకటని అన్నారు. క్షయ వ్యాధిపై సమాజాన్ని పూర్తిస్థాయిలో మరింత చైతన్యవంతం చేసేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు పేరొందిన స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించినట్లు వివరించారు. క్షయ వ్యాధి అంటువ్యాధి అని మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్‌ క్లోసిస్‌ అనే సూక్ష్మజీవి ద్వారా ఇది సంక్రమిస్తుందని చెప్పారు. రెండు వారాలకు మించి దగ్గు, ఇతర లక్షణములు, ఆయాసం, బరువు తగ్గుట, కఫంలో రక్తం పడుట, ఛాతి నొప్పి, సాయం కాలం జ్వరం, రాత్రి నిద్రలో చెమట పట్టడం తదితర క్షయ రోగి లక్షణాలు ఉంటాయని తెలిపారు. క్షయ రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

 

➡️