చలో విజయవాడ భగ్నానికి యత్నం

జగనన్న గోరుముద్ద

మహాలక్ష్మిని హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు

  • ఎండిఎం గౌరవాధ్యక్షులు మహాలక్ష్మి హౌస్‌ అరెస్టు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జగనన్న గోరుముద్ద మెనూ ఛార్జీలు పెంచాలని, వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఈనెల ఐదో తేదీన చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని భగం చేసేందుకు ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు తెరతీసింది. ఇందులో భాగంగా ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మిని నగరంలోని మహాలక్ష్మినగర్‌ కాలనీలో గల ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఎండిఎం సంఘ నాయకులకు పోలీసులు ఫోన్లు చేసి చలో విజయవాడకు వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. అక్రమ అరెస్టును సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ఖండించారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉద్యమిస్తున్న ఎండిఎం కార్మికుల గొంతు నొక్కే చర్యలు సరికాదన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మహాలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.పది వేల వేతనం ఇస్తామని ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో జగన్‌ హామీనిచ్చారని గుర్తుచేశారు. నేటికీ ఆ హామీని అమలు చేయకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. సమస్యలను పరిష్కరించమంటే అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించానలి డిమాండ్‌ చేశారు.

 

➡️